కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో యూట్యూబర్ నరేందర్ అరెస్ట్
ABN , Publish Date - Jan 22 , 2026 | 10:11 AM
సినీ నటి కరాటే కళ్యాణిపై దాడి కేసులో యూట్యూబర్ నరేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
హైదరాబాద్, జనవరి 22: సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణిపై(Karate Kalyani) దాడి ఘటనలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సిద్ధమౌని నరేందర్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపల తిరుపతి దేవస్థానం(TTD) పేరును దుర్వినియోగం చేస్తూ లక్కీ డ్రా పేరుతో కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని నరేందర్‌పై కరాటే కళ్యాణి గతంలో పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. రూ.399కే ఫార్చ్యూనర్ కారు, ఐఫోన్ వంటి బహుమతులు గెలుచుకోవచ్చని తప్పుడు ప్రచారం చేస్తూ అమాయకుల నుంచి నరేందర్ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఆదిభట్ల సమీపంలోని వండర్లా పరిసరాల్లో ఫార్చ్యూనర్ కారు పేరుతో లక్కీ డ్రా ప్రచారం చేస్తుండగా.. నరేందర్‌ను కరాటే కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదే సమయంలో ఆమెతో పాటు పంజాగుట్ట పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో కళ్యాణిపై దాడి చేసేందుకు 10 మంది యత్నించారు. ఆమె చున్నీ లాగేసి భయపెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు నరేందర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై బీఎన్‌ఎస్(BNS) సెక్షన్లు 74, 75, 79, 115(2), 132, 351(2), 352 కింద కేసు నమోదు చేశారు.
అయితే.. గతంలో మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో చైన్ స్నాచింగ్ కేసులో కూడా నరేందర్ నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. నరేందర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అతడిపై మోసాలు, దాడి ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి...
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. గుండెపోటని నాటకమాడి..
ఏడాదిన్నర తర్వాత బయటికొస్తా..!
Read Latest Telangana News And Telugu News