ఫోన్ ట్యాపింగ్ విచారణ పేర.. గుంపు మేస్త్రి, గుంటనక్క డ్రామా
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:59 AM
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ అంతా ఒక పెద్ద డ్రామా అని, గుంపు మేస్త్రీ, గుంటనక్క కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.
ఈ విచారణతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు
మునిసిపల్ ఎన్నికల్లో బీసీలకు 42ు కల్పించకుండా దృష్టి మళ్లించే కుట్ర
ఈ ఎన్నికల్లో మేం పోటీ చేయం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళల్లో ఎవరైనా సంప్రదిస్తే మద్దతిస్తాం
సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ ఉద్యమిస్తామనడం విచిత్రం: కవిత
హైదరాబాద్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ అంతా ఒక పెద్ద డ్రామా అని, గుంపు మేస్త్రీ, గుంటనక్క కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ విచారణ వల్ల తనలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. బుధవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమనేత, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం కవిత మాట్లాడుతూ.. బీసీలకు గ్రామపంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్యాయం చేసిందని, మునిసిపల్ ఎన్నికల్లో 42ు రిజర్వేషన్లపై బీసీలు ప్రశ్నించకుండా ఉండేందుకు ఫోన్ ట్యాపింగ్ డ్రామా చేస్తున్నారని, గుంపుమేస్త్రీ, గుంటనక్క ఇద్దరూ కలిసే ఉన్నారన్నారు. ప్రజల దృష్టి మళ్లించడమే వీరి వ్యూహమని మండిపడ్డారు. జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరించలేదని, ఈ కారణంగా మునిసిపాలిటీ ఎన్నికల్లో పార్టీపరంగా పోటీ చేయడంలేదని చెప్పారు. అయితే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, యువత, మహిళలు ఎవరైనా తమను సంప్రదిస్తే వారికి మద్దతునిస్తామన్నారు. తనతోపాటు జాగృతి నాయకులు వారికోసం ఎన్నికల ప్రచారం చేస్తారని వెల్లడించారు. సికింద్రాబాద్ జిల్లా కావాలని అడిగిన వారిని అధికారంలో ఉన్న పదేళ్లలో బీఆర్‌ఎస్ పార్టీ అణిచివేసిందని, ఇప్పుడు మాత్రం సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమిస్తామని కేటీఆర్ చెప్పడం విచిత్రంగా ఉందన్నారు.
జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సరే.. సికింద్రాబాద్‌ను జిల్లా చేయాల్సిందేనని, అదేవిధంగా ఒక జిల్లాకు పీవీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ కులాల పేర్లు, ఉపకులాలకు అన్యాయం జరగకుండా జాగృతి తరఫున సమాచారం ేసకరించి నివేదిక సిద్ధం చేస్తావన్నారు. ప్రభుత్వమే ఈ పని చేయాల్సి ఉన్నప్పటికీ.. గుంపు మేస్త్రీ చేస్తారన్న నమ్మకం లేదని పేర్కొన్నారు. కొత్త పార్టీ ఏర్పాటుకు కసరత్తు వేగంగా జరుగుతోందని, జాగృతి ఏదోరోజు కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, అప్పుడు తెలంగాణ మలిదశ ఉద్యమం తొలి అమరుడు శ్రీకాంతాచారి జయంతి, వర్ధంతిని ప్రభుత్వపరంగా నిర్వహిస్తామన్నారు. ముచ్చర్ల సత్యనారాయణ వంటి ఉద్యమకారుల గురించి కొత్తతరం నాయకులకు తెలియాల్సి ఉందన్నారు. సింగరేణిలో సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ విధానం ఎప్పట్నుంచో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ప్రధాన నిబంధనగా పెట్టారన్నారు. కొంత మందికే సెలెక్టివ్‌గా టెండర్లు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మహిళా సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులు
సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో.. 4 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు ఏసీ బోగీలు