ఏడాదిన్నర తర్వాత బయటికొస్తా..!
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:47 AM
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రపై మరోసారి నాలుక మడతేశారు. ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని..
అప్పుడే పాదయాత్ర చేస్తా: జగన్
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రపై మరోసారి నాలుక మడతేశారు. ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని.. పాదయాత్ర చేపడతానని గతంలో పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో ఆయన ప్రకటించారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఆయన బస్సుయాత్ర చేపడతారని వైసీపీ సోషల్ మీడియా విస్తృత ప్రచారం కూడా చేసింది. అయితే వీటన్నిటికీ జగనే ఫుల్‌స్టాప్ పెట్టారు. ఏడాదిన్నర తర్వాతే తాను బయటకు వస్తానని.. అప్పుడే పాదయాత్ర ఉంటుందని ఏలూరు వైసీపీ నేతల సమావేశంలో ఆయన వెల్లడించారు. ‘చూస్తుండగానే రెండేళ్లు గడుస్తున్నాయి. వచ్చే నెల చివరిలో లేదా మార్చి మొదట్లో ఈ ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అంటే ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మూడేళ్లు మాత్రమే. అందులో ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలు పెడతాను. దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే, ప్రజలతోనే ఉంటాను’ అని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగ్లాల్లోనూ విఫలమైందని ఆరోపించారు. ప్రజలు ఇప్పుడు తనను కోరుకుంటున్నారని ప్రకటించుకున్నారు. 2024లో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే జనంలోకి వెళ్తానని.. పాదయాత్ర చేస్తానంటూ క్యాడర్‌కు ఆయన చెబుతూ వచ్చారు. కానీ రెండేళ్లు గడుస్తున్నా పాదయాత్ర ఎప్పుడో స్పష్టత ఇవ్వలేదు. ఈ సంక్రాంతి తర్వాత జిల్లా పర్యటనలకు వెళ్తానని కూడా విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించారు. ఈ నెల 26 నుంచి తమ నేత బస్సు యాత్ర చేయబోతున్నారని వైసీపీ సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. ఏమైందో ఏమో.. ఆయన ఏడాదిన్నర తర్వాత బయటకు వచ్చి పాదయాత్ర చేస్తానని ఇప్పుడు చెప్పారు. ఇదెంతవరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.