Share News

కేంద్రం నిధులు ఇవ్వకుంటే.. తెలంగాణ అభివృద్ధి లేదు: కేంద్ర మంత్రి

ABN , Publish Date - May 08 , 2026 | 07:40 PM

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులు ఇస్తుందని కేంద్రం హోం శాఖ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆ నిధులతోనే తెలంగాణ అంతో ఇంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

కేంద్రం నిధులు ఇవ్వకుంటే.. తెలంగాణ అభివృద్ధి లేదు: కేంద్ర మంత్రి
Central minister Bandi Sanjay

హైదరాబాద్, మే 08: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులు ఇస్తుందని కేంద్రం హోం శాఖ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆ నిధులతోనే తెలంగాణ అంతో ఇంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశమే లేదన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. దేశ రాజధాని నుంచి తాము నిధులు తెస్తుంటే.. కాంగ్రెస్ వాళ్లు తెలంగాణ సొమ్మును ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు పంపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని నడుపుకోవడానికి తెలంగాణ సొమ్మును వినియోగిస్తున్నారని ఆరోపించారు.


డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసం మోదీ హైదరాబాద్ వస్తున్నారని వివరించారు. తమ నినాదం జై శ్రీరాం... జై తెలంగాణతోపాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే అని స్పష్టం చేశారు. జై శ్రీరాం.. జై తెలంగాణ నినాదాలతో పరేడ్ బహిరంగ సభ దద్దరిల్లుతుందని చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాదిరిగా తనకు దోచుకోవడం తెలియదన్నారు. రైతులకు బేడీలు వేసి అరిగోస పెట్టడం తనకు తెలియదని చెప్పారు. డ్రగ్స్ తీసుకోవడం కూడా తమకు తెలియదని పేర్కొన్నారు.


కాళేశ్వరం, ఈ పార్ములా, విద్యుత్ కొనుగోళ్ల అవినీతి వంటివి తమకు తెలియదని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యంగ్యంగా అన్నారు. ఫాంహౌస్ డ్రగ్స్ కేసులు కూడా తమకు తెలియదని చెప్పారు. మంది కొంపలు ముంచడం అసలే తెలియదంటూ కేటీఆర్‌కు చురకలు అంటించారు. నోరు అదుపులోకి పెట్టుకోవాలంటూ కేటీఆర్‌కు ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. నీ అహంకారం వల్లే కేసీఆర్ ఫాంహౌస్‌కు పరిమితమయ్యారని చెప్పారు. నీ కార్యకర్తలే కేటీఆర్‌ను చూసి ఆ పార్టీ కార్యకర్తలే అసహ్యించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


బీఆర్ఎస్ ఏం చేసినా అధికారంలోకి రావడం కల్ల అని కుండ బద్దలు కొట్టారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే అని ఆయన జోస్యం చెప్పారు. మోదీ సభ తరువాత రాష్ట్రంలో జరగబోయేది చూడండంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మే10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌ వేదికగా జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తనూజ హత్య కేసులో కీలక అప్ డేట్

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు పావలా వడ్దీకే రుణాలు: సీఎం చంద్రబాబు

Read Latest TG News And Telugu News

Updated Date - May 08 , 2026 | 07:44 PM