తనూజ హత్య కేసులో కీలక అప్ డేట్
ABN , Publish Date - May 08 , 2026 | 07:12 PM
ఐపీఎస్ మాజీ అధికారి వినయ్ రంజన్ రే నివాసంలో పని చేసే నేపాలీ ముఠా గురువారం తెల్లవారుజామున ఆయన భార్య తనూజను హత్య చేశారని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
హైదరాబాద్, మే08: ఐపీఎస్ మాజీ అధికారి వినయ్ రంజన్ రే నివాసంలో పని చేసే నేపాలీ ముఠా గురువారం తెల్లవారుజామున ఆయన భార్య తనూజను హత్య చేసిందని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేశారని వివరించారు. నేపాలీ ముఠాలతో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలను ఆయన హెచ్చరించారు. అవకాశం కోసం ఈ నేపాలీ ముఠా ఎదురు చూస్తుంటాయని పేర్కొన్నారు. బెంగళూరు, ముంబై, పుణె నగరాల్లో నేపాలీ ముఠాలు నేరాలకు పాల్పడుతున్నాయని గుర్తు చేశారు. నిందితులను పట్టుకునేందుకు 10 బృందాలు రంగంలోకి దిగాయని సీపీ సజ్జనార్ చెప్పారు.
తనూజ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి..
వినయ్ రంజన్ రే భార్య తనూజ మృతదేహానికి ఇప్పటికే పోస్ట్‌మార్టం పూర్తయింది. ప్రశాసన్ నగర్‌లోని ఐపీఎస్ అధికారి నివాసానికి ఆమె మృతదేహాన్ని తరలించారు. గురువారం రాత్రి రెండు గంటలకు ఇంట్లోకి చొరబడి తనుజను హత్య చేసిన నిందితులు నగదుతో పరారయ్యారు. వినయ్ రంజన్ నివాసంలో పని చేసే నేపాల్‌కు చెందిన కల్పన ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఇంట్లో వినయ్ రంజన్ లేకపోవడంతో బయట నుంచి మరో ముగ్గురిని కల్పన పిలిపించి.. ఈ హత్యను చేసినట్లు పోలీసులు కనుగొన్నారు.
ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్‌కు..
తనూజను బంధించడానికి తమతో పాటే నిందితులు క్లాత్ తెచ్చుకున్నారు. ఈ దోపిడి అనంతరం ఇంటి వెనుక భాగంలోని పార్క్ నుంచి వారంతా పరారయ్యారు. ఈ దోపిడి తర్వాత వారంతా ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో నిందితులు వెళ్లినట్లు పరిశీలనలో తేలింది. ఇంకో వైపు రెండు పోలీస్ బృందాలు ఇప్పటికే నేపాల్‌కు బయలుదేరి వెళ్లాయి. కల్పన అండ్ గ్యాంగ్ కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు.
భూపేందర్ గ్యాంగ్‌తో కల్పనకు సంబంధాలు..
గతంలో నందగిరి హిల్స్‌లో భారీ దోపిడి జరిగింది. ఈ దోపిడీకీ ఈ నేపాలీ గ్యాంగ్‌కు సంబంధం ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో బహిర్గతమైనట్లు తెలుస్తోంది. నందగిరి హిల్స్‌లోని వ్యాపారి ఇంట్లో రూ.1.3 కోట్ల విలువైన వజ్రాలను భూపేందర్ షాహీ నేపాలీ గ్యాంగ్ చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ గ్యాంగ్‌తో కల్పనకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు పావలా వడ్దీకే రుణాలు: సీఎం చంద్రబాబు
కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: మంత్రి సత్యకుమార్
Read Latest TG News And Telugu News