Share News

కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: మంత్రి సత్యకుమార్

ABN , Publish Date - May 08 , 2026 | 05:50 PM

ఏపీలో కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోగుల కోసం ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: మంత్రి సత్యకుమార్
AP Minister SatyaKumar

అమ‌రావ‌తి, మే 08: రాష్ట్రంలో కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం రాజధాని అమరావతిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్ ఏజెన్సీకి టెండర్ ద్వారా వీటి నిర్వహణ చేపడతాయని తెలిపారు. ఇప్పటికే కూటమి పాలనలో 12 డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు.


అద‌న‌పు డయాలసిస్ కేంద్రాల‌తో క‌లిపి మొత్తం 73 కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి అందుబాటులోకి వచ్చాయని మంత్రి సత్యకుమార్‌ వివరించారు. ‘ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం' (PMNDP) కింద రాష్ట్రంలోని సెకండరీ ఆసుపత్రుల్లో (జిల్లా, ప్రాంతీయ, సామాజిక) 61 కేంద్రాలు నడుస్తున్నాయని వివరించారు. వీటికి అదనంగా ఈ 12 కేంద్రాలు వస్తున్నాయని తెలిపారు.


కొత్త కేంద్రాల రాకతో దూర ప్రాంతాలకు వెళ్లి రక్త శుద్ధి చేయించుకునే రోగులకు అవస్థలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సేవలు పూర్తిగా ఉచితమని తెలిపారు. ఈ కేంద్రాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ఐదేళ్లకు కలిపి సుమారు రూ.30 కోట్ల వరకు ఖర్చు చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ వివరించారు.


ఇక ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 2,721పైగా డయాలసిస్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 985 మిషన్లు, నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో 1,736 డయాలసిస్ మిషన్లు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 21,504 మంది కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు పావలా వడ్దీకే రుణాలు: సీఎం చంద్రబాబు

రాయలసీమకు దూసుకొస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2026 | 06:30 PM