Share News

రాయలసీమకు దూసుకొస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 08 , 2026 | 12:46 PM

ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘రాయల‌సీమ ఇప్పుడు రాయల్‌ సీమ’ అనే టైటిల్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ ఉన్న ఫోటోను సీఎం షేర్ చేశారు.

రాయలసీమకు దూసుకొస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి, మే 8: ఏపీకి ప్రపంచ ప్రఖ్యాత ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ రాబోతోంది. తిరుపతిలో రూ.2,500 కోట్లతో మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమను రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘రాయల‌సీమ ఇప్పుడు రాయల్‌సీమ’ అనే టైటిల్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ ఉన్న ఫొటోను సీఎం చంద్రబాబు షేర్ చేశారు. ఈ ఫొటోకి ‘రాయలసీమకు దూసుకువస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్’ అంటూ క్యాప్షన్ పెట్టారు.


రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్‌ఐపీబీ).. రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం సత్యవేడు పరిధిలోని వన్నెలూరు, రాళ్లకుప్పం గ్రామాల్లో సుమారు 267 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 5,000 మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.


ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్న సీఎం

నిన్న(గురువారం) జరిగిన కలెక్టర్ల సమావేశంలోనూ ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్ సంస్థ రావడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. కాలేజీ రోజుల్లో బుల్లెట్ బండి నడిపిన సంగతులను సీఎం గుర్తుచేసుకున్నారు. ‘కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ డ్రైవ్ చేశా.. ఇప్పుడు ఆ సంస్థను ఏపీకి తెచ్చాం’ అంటూ ఆనాటి జ్ఞాపకాలను చంద్రబాబు పంచుకున్నారు.


ఇవి కూడా చదవండి..

ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం.. మంత్రులు, అధికారులకు సీఎం అభినందనలు

నకిలీ విత్తనాలతో మోసం.. తీవ్ర నష్టాల్లో రైతులు

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2026 | 01:05 PM