Share News

యువకుడి దారుణ హత్య.. యువతి ఇంటి ముందు ఆందోళన.. ఉద్రిక్తం

ABN , Publish Date - May 08 , 2026 | 10:46 AM

సికింద్రాబాద్ చిలకలగూడలో బీటెక్ విద్యార్థి యువన్‌ను కొందరు దారుణంగా చంపేశారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి ఇంటి వద్ద యువన్ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.

యువకుడి దారుణ హత్య.. యువతి ఇంటి ముందు ఆందోళన.. ఉద్రిక్తం
Secunderabad News

సికింద్రాబాద్, మే 8: సికింద్రాబాద్ చిలకలగూడలో ఓ యువకుడి దారుణ హత్య ఉద్రిక్తతలకు దారి తీసింది. బీటెక్ విద్యార్థి యువన్‌ను కొందరు దారుణంగా చంపేశారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి ఇంటి వద్ద యువన్ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిందితులను తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. యువతి కుటుంబసభ్యులే యువన్‌పై దాడి చేసి, కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. యువతి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


నిన్న(గురువారం) యువన్‌ తన స్నేహితులతో కలిసి చిలకలగూడలో ఓ ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం కత్తులతో, మారుణాయుధాలతో యువన్‌పై దాడి చేశారు. తల, గొంతు, శరీరభాగాల్లో తీవ్రమైన కత్తిపోట్లు కావడంతో యువన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈరోజు(శుక్రవారం) ఉదయం యువన్ కుటుంబసభ్యులు యువతి ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, నిందితులను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.


నిందితులను పట్టుకుంటాం: సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నరసయ్య

యువన్‌ హత్యకు సంబంధించిన వివరాలను సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నరసయ్య మీడియాకు తెలియజేశారు. ‘రాత్రి 8:30 గంటల సమయంలో యువన్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ప్రేమ వ్యవహారం హత్యకు కారణంగా ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుడి కుటుంబం గతంలో సీతాఫల్‌మండిలో ఉండేది. ఆ సమయంలోనే యువతి, యువన్‌కు మధ్య ప్రేమ మొదలైంది. జవహర్‌నగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రావడంతో నాలుగు నెలల క్రితం అక్కడికి యువకుడి కుటుంబం షిఫ్ట్ అయ్యింది. నిన్న రాత్రి స్నేహితులతో కలిసి యువన్ మ్యాచ్ చూస్తున్న సమయంలో ఒక్కసారిగా దాడి చేశారు. యువన్‌కు తీవ్రమైన కత్తిపోట్లు అయ్యాయి. ఆస్పత్రికి తరలించాక మరణించాడు. హత్యలో పరమేశ్ అనే వ్యక్తితో పాటు మరో ఐదు మంది పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. త్వరలో నిందితులను అరెస్ట్‌ చేస్తాం. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాం. నిందితులకు డ్రగ్స్ అలవాటు ఉందా లేదా అని పరీక్షలు చేస్తాం. ఇప్పటికీ మృతుడు, ప్రేమించిన యువతి మాట్లాడుకుంటున్నారా? లేదా అని తెలియాల్సి ఉంది. హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. గతంలో నిందితులపై కేసులు గురించి ఆరా తీస్తాం. ఈ కేసులో అమ్మాయి ప్రమేయం, ఫోన్ సంభాషణలపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. కుటుంబ సభ్యులు ఎలాంటి అపోహలకు పోవద్దు.. న్యాయం చేస్తాం’ అని నరసయ్య పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

తలసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా ఉంటాం: మంత్రి దామోదర రాజనర్సింహ

ఎన్ని ఇబ్బందులున్నా ప్రాణహిత ప్రాజెక్ట్‌ను నిర్మించి తీరుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 08 , 2026 | 12:30 PM