తలసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా ఉంటాం: మంత్రి దామోదర రాజనర్సింహ
ABN , Publish Date - May 08 , 2026 | 09:36 AM
తలసేమియా బాధితులకు క్రమం తప్పకుండా రక్త మార్పిడి అవసరం అవుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. తలసేమియా, ఇతర రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి అన్ని దశల్లో అండగా ఉండడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
హైదరాబాద్, మే 8: తలసేమియా అంటువ్యాధి కాదని.. ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యుపరమైన వ్యాధి అని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సమీప బంధువుల మధ్య వివాహాలు జరిగే సందర్భాల్లో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుందన్నారు. యువత వివాహానికి ముందు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలన్నారు. కొత్తగా వివాహమైన దంపతులకు కూడా జన్యుపరమైన, ఇతర వ్యాధులపై అవగాహన అవసరమని వెల్లడించారు. తలసేమియా, ఇతర జన్యుపరమైన వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటికే సికిల్‌సెల్ వ్యాధిపై దాదాపు 11 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించామన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన రోగులకు ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉచితంగా చికిత్స, అవసరమైన మందులు అందిస్తున్నామని తెలిపారు. తలసేమియా బాధితులకు క్రమం తప్పకుండా రక్త మార్పిడి అవసరం అవుతుందన్నారు. ఐరన్ చెలేషన్ థెరపీ వంటి చికిత్సలు కూడా అవసరం అవుతాయన్నారు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అవసరం అవుతుందని చెప్పారు. ఈ చికిత్సల ఖర్చు కుటుంబాలపై భారీ భారం అవుతుందన్నారు. అందుకే తలసేమియా, ఇతర రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి అన్ని దశల్లో అండగా ఉండడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ప్రభుత్వ హాస్పిటల్స్‌లో రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్స్, అవసరమైన మందులు, అధునాతన చికిత్స సౌకర్యాలను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు.హైదరాబాద్‌లోని నిమ్స్‌లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతర సేవలు అందించేందుకు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మంలో డే కేర్ సెంటర్లు ఉన్నాయని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్‌లో అమెరికా వార్ షిప్‌లపై దాడి.. ఇరాన్‌పై ట్రంప్ ఆగ్రహం..
Read Latest Telangana News And Telugu News