Share News

అభ్యుదయ కూటమిపై క్యాపిటలిస్టుల దుష్ప్రచారం

ABN , Publish Date - Nov 15 , 2026 | 05:08 AM

అభ్యుదయ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా క్యాపిటలిస్టులు.. పెయిడ్‌ మీడియా, ఏఐ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిని ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ కావాలని వక్తలు సూచించారు.

అభ్యుదయ కూటమిపై క్యాపిటలిస్టుల దుష్ప్రచారం
Bharat Summit 2026

  • సోషల్‌ మీడియా ద్వారా ప్రతిపక్షాలపై దాడులు

  • భారత్‌ సమ్మిట్‌లో వక్తల అభిప్రాయాలు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): అభ్యుదయ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా క్యాపిటలిస్టులు.. పెయిడ్‌ మీడియా, ఏఐ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిని ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ కావాలని వక్తలు సూచించారు. ‘భారత్‌ సమ్మిట్‌’ రెండో రోజు ‘ప్రోగ్రెసినేషన్‌ అండ్‌ అకౌంటబిలిటీ’ అంశంపై జరిగిన చర్చలో ఫిన్లాండ్‌ సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ అంటన్‌ రోన్‌హల్మ్‌, ఉరుగ్వే సోషలిస్ట్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ పాబ్లో ఓర్బి, థాయ్‌లాండ్‌ పీపుల్స్‌పార్టీ అడ్వైజర్‌ పెనగనార్‌ బూన్‌క్లుమ్‌, ఎఫ్‌ఈపీఎస్‌ డెమొక్రసీ హెడ్‌ క్రిస్టియన్‌ స్లామ్‌ తదితరులు పాల్గొని కీలక ప్రసంగాలు చేశారు. సోషల్‌ మీడియాలో నకిలీ సమాచారం వేగంగా వైరల్‌ అవుతోందని.. తప్పుడు సమాచారమని నిర్ధారించేలోపే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తోందన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్నా, ఎన్నికల కమిషన్‌ వ్యవహారశైలిపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నా స్పందన ఉండటం లేదని విమర్శించారు.


సమాచార విస్తృతి పెరుగుతోంది.. విశ్వసనీయత తగ్గుతోంది!

సమాచార విస్తృతి పెరుగుతున్నప్పటికీ విశ్వసనీయత తగ్గుతోందని, ఏఐ రాకతో అసలైన సమాచారాన్ని గుర్తించడం కష్టంగా మారిందని వక్తలు అభిప్రాయపడ్డారు. భారత్‌ సమ్మిట్‌లో ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ మీడియా’ అంశంపై జరిగిన చర్చలో జర్మనీకి చెందిన లియోనార్డ్‌ నావీ, ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షురాలు సంగీతా బారువా పిషరోటీ, ఇటలీకి చెందిన ఫ్రాన్సెస్కో లపెంటా తదితరులు ప్రసంగించారు. ప్రకటనల ఆదాయం డిజిటల్‌ వేదికలకు మళ్లడంతో స్థానిక వార్తా సంస్థల మనుగడ కష్టమవుతోందన్నారు. ఏ సమాచారం ప్రజలకు కనిపించాలనే అంశాన్ని కూడా డిజిటల్‌ వేదికలే ప్రభావితం చేస్తున్నాయని... ఏఐతో తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌ల ముప్పు పెరుగుతోందన్నారు. సమాచారానికి కొరత లేదని, దాని నిజానిజాలను నిర్ధారించడమే సమస్యగా మారిందని.. మీడియా సంస్థలు కంటెంట్‌ సృష్టికర్తలు, ప్రజలతో భాగస్వామ్యం కావాలని సూచించారు.


అగ్రరాజ్యాల ఆగడాలను అడ్డుకోవాలి

  • ఇందుకు చిన్న దేశాలు కూటమిగా ఏర్పడాలి

అగ్రరాజ్యాలు ఇతర దేశాలపై చేస్తున్న దాడులు, బలప్రయోగాలను అడ్డుకునేందుకు చిన్న దేశాలు కూటమిగా ఏర్పడి,కార్యాచరణ రూపొందించుకోవాలని వక్తలు సూచించారు. ‘పీస్‌ ఇన్‌ ద న్యూ వరల్డ్‌’ అంశంపై జరిగిన చర్చలో ఈజిప్ట్‌ సెనేటర్‌ బాకన్‌ కమేల్‌, ఈక్వెడార్‌ మాజీ మంత్రి గులిమలి లాంగ్‌, కాంబోడియా కార్మిక మంత్రి చర్ల లాపేజ్‌ ఓబర్గాన్‌, రాజ్యసభ ఎంపీ నసీర్‌ హుస్సేన్‌, ఎఫ్‌ఈపీఎస్‌ మాజీ ప్రెసిడెంట్‌ మారియా జావో రోడ్రిగ్‌ మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్‌.. ఇరాన్‌- అమెరికా- ఇజ్రాయిల్‌ యుద్ధాల్లో అమాయకులైన మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రరాజ్యాల దాడులను అడ్డుకోవడంలో ఐక్యరాజ్యసమితి విఫలమైందన్నారు. అంతర్జాతీయ చట్టాలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు చిన్న దేశాలు ఐక్యంగా తమ రక్షణకు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 05:08 AM