BJP Chief Ramchander Rao: త్వరలో మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాల్సిందే: రాంచందర్ రావు
ABN , Publish Date - Jan 17 , 2026 | 01:29 PM
మున్సిపల్ ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలన్నారు.
హైదరాబాద్, జనవరి 17: రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు(Telangana BJP Chief Ramchander Rao) పేర్కొన్నారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు చేసిన కృషిని ఆయన అభినందించారు. దాదాపు 5 వేల సర్పంచ్ స్థానాలకు పోటీ చేశామని.. గతంలో కంటే బీజేపీ సర్పంచ్‌ల సంఖ్య పెరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలోపేతమైందని.. ఇందుకు ఈ ఫలితాలే నిదర్శనమని చెప్పారు.
బీఆర్‌ఎస్ ముక్కలవడం ఖాయం..
బీఆర్ఎస్ పార్టీ త్వరలో ముక్కలవుతుందని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని తెలంగాణ బీజేపీ చీఫ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ వెళ్లడం, సభలు నిర్వహించడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 40 శాతం కమిషన్‌గా మారిపోయిందని, పారిశ్రామికవేత్తలను బెదిరిస్తుందని ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పెద్దఎత్తున నిధులు అందిస్తోందని.. వాటితోనే అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రాజెక్టులకు, విద్యాలయాలకు భూమి కేటాయించడం లేదని ఆయన విమర్శించారు.
అబద్ధాలు ప్రచారం..
కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏమీ చేయలేదని రాంచందర్ రావు విమర్శించారు. గ్రామాల్లో అభివృద్ధికి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదని, కేంద్ర నిధులతోనే చేయవచ్చని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర పథకాలపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని.. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో కేంద్ర పథకాలను తీసుకెళ్లాలని సూచించారు. ఇటీవల త్రివేండ్రం ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేశామని.. కేరళలో కార్యకర్తలపై దాడులు జరిగినా పట్టువదలకుండా పనిచేశామని, ముంబై కార్పొరేషన్‌లోనూ గెలిచామని గుర్తుచేశారు. బీఎంసీ ఎన్నికల్లో 29 మున్సిపాలిటీల్లో 25 స్థానాల్లో బీజేపీ గెలిచిందని పేర్కొన్నారు.
అందుకు మేం సిద్ధం..
తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలన్నారు రాంచందర్ రావు. ప్రజల సేవకు కమిట్మెంట్‌తో పనిచేస్తామని, ప్రజలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. మున్సిపాలిటీలకు కేటాయించిన ప్రాంతాల్లో నాయకులు అక్కడే ఉండాలని, బీజేపీ జెండాను ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
పల్టీలు కొట్టిన కారు.. ఇద్దరు టీచర్లు మృతి
Read Latest Telangana News And Telugu News