Share News

22ఏపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం

ABN , Publish Date - Sep 07 , 2026 | 04:12 AM

నిషేధిత భూముల జాబితా (22ఏ) వ్యవహారంపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేఎల్పీ తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సర్కారు కనీసం స్పందించడం లేదని మండిపడింది.

22ఏపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం

  • బీజేఎల్పీ తీర్మానం..

  • ప్రజల ఇబ్బందుల్ని సర్కారు పట్టించుకోవడం లేదని ధ్వజం

  • మంత్రి పొంగులేటి రాజీనామాకు పట్టుబట్టాలని నిర్ణయం

  • కాంగ్రెస్‌ మోసాలను ఎండగడతాం

  • బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి

  • రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం నేడు బీజేపీ అసెంబ్లీ ముట్టడి

హైదరాబాద్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): నిషేధిత భూముల జాబితా (22ఏ) వ్యవహారంపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేఎల్పీ తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సర్కారు కనీసం స్పందించడం లేదని మండిపడింది. 22ఏ పేరిట భారీ భూ దందాకు తెరతీశారని ఆరోపించింది. ఈ వ్యవహారంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాజీనామాకు పట్టుబట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. పొరపాటు జరిగిందని చెబితే సరిపోదని, వేలాది మందిని ఇబ్బందులకు గురిచేస్తున్నందుకు మంత్రి బాధ్యత వహించాల్సిందేనని వారు తేల్చిచెప్పారు. 22ఏ వ్యవహారంలో ప్రభుత్వంతో అటో ఇటో తేల్చుకునేందుకు సన్నద్ధమయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. బీజేఎల్పీలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు, ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, పాయల్‌ శంకర్‌, సూర్యనారాయణ గుప్తా, వెంకటరమణారెడ్డి, డాక్టర్‌ పాల్వాయి హరీష్‌, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి పాల్గొన్నారు. ‘రాష్ట్రంలో కోటి ఎకరాలను 22ఏలో చేర్చి దోచుకుంటున్నారు. అన్యాయంగా ఈ జాబితాలో చేర్చడమే ఒక తప్పయితే, బాధిత రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం, అధికారులు సతాయించడం మరోటి. ఇంతేకాదు.. నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటే 50శాతం వాటా డిమాండ్‌ చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? అందుకే, బాధిత రైతులకు అండగా నిలవాలని నిర్ణయించాం. వారికి న్యాయం జరిగే వరకూ ఎంతదూరమైనా వెళ్లాలని నిర్ణయించాం’ అని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. ‘అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులు తూతూమంత్రంగా నిర్వహించి ముగించకుండా చూడాలని నిర్ణయించాం. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించాలన్నది మా డిమాండ్‌. మూసీ ప్రక్షాళన పేరిట భారీ కుంభకోణానికి తెరతీశారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలయ్యింది. ఈ అంశాలపై సమగ్రంగా చర్చించాలని పట్టుబడతాం’ అని మరో ఎమ్మెల్యే తెలిపారు. కాగా, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌ పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్నారు.


కాంగ్రెస్‌ మోసాలను ఎండగడతాం: మహేశ్వర్‌రెడ్డి

వెయ్యి రోజుల్లో కాంగ్రెస్‌ చేసిన మోసాలను అసెంబ్లీ వేదికగా ఎండగడతామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. రిటైర్డు ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేకపోతున్నారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు విడుదల చేయడం లేదు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ వారిని మోసం చేసింది. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పి మూడు సీజన్‌లుగా రైతులకు ఇవ్వలేదు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 22 లక్షల మంది రైతులను మోసం చేసింది. నిరుద్యోగులకు రూ.5 లక్షల భరోసా కార్డులు ఇవ్వలేదు’ అని ఆయన పేర్కొన్నారు. బీజేఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు. ఉద్యోగులకు పీఆర్‌సీ, పెండింగ్‌ డీఏలపై ప్రభుత్వం దాటవేత ధోరణి అనుసరిస్తోందని విమర్శించారు.


ఫీజు బకాయిల కోసం నేడు అసెంబ్లీ ముట్టడి

ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిల విడుదల కోసం సోమవారం అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తామని బీజేవైఎం అధ్యక్షుడు కుందే గణేశ్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతంరావు, వేముల అశోక్‌, వీరేందర్‌గౌడ్‌ తెలిపారు. వేలాది మంది విద్యార్థులతో ధర్నాచౌక్‌లో ‘ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి’ పేరిట తాము మహాధర్నా నిర్వహించాలని అనుకుంటే, పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. దీంతో విద్యార్థులంతా నేరుగా అసెంబ్లీకి చేరుకుంటారని వారు తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు నేతృత్వంలో జరిగే ఈ పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల

రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 04:12 AM