Share News

సీఎం సభకు విస్తృత ఏర్పాట్లు

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:03 AM

మండలంలోని చందనాడ పంచాయతీ శివారు పాటిమీద గ్రామంలో ఆర్సెలార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌ భూమి పూజ, సీఎం బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 23న జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.

	సీఎం సభకు విస్తృత ఏర్పాట్లు
సీఎం సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న హోం మంత్రి అనిత

- చందనాడ పంచాయతీ శివారు పాటిమీద గ్రామంలో సిద్ధమవుతున్న వేదిక

- ఆర్సెలార్‌ మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌ భూమి పూజ అనంతరం ప్రసంగించనున్న ముఖ్యమంత్రి

- సభా వేదిక సమీపాన వాహనాల పార్కింగ్‌కు స్థలం కేటాయింపు

నక్కపల్లి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చందనాడ పంచాయతీ శివారు పాటిమీద గ్రామంలో ఆర్సెలార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌ భూమి పూజ, సీఎం బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 23న జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. ఇందు కోసం విశాలమైన సభావేదికను సిద్ధం చేస్తున్నారు. సభా వేదిక ముందు వీఐపీలు కూర్చోవడానికి కొత్త సోఫా సెట్లను సిద్ధం చేశారు. కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రుల కోసం ప్రత్యేక గ్యాలరీలను సభావేదిక పక్కన ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్‌ కోసం సుమారు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

వీఐపీల భద్రతకు అధిక ప్రాధాన్యం

మండలంలో ఆర్సెలార్‌ మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌కు ఈ నెల 23న జరిగే భూమి పూజకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో సహా అనేక కేంద్ర, రాష్ట్ర మంత్రులు వస్తున్న నేపథ్యంలో వీఐపీల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అదే సమయంలో సభకు వచ్చే సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని పోలీస్‌ అధికారులను హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. శనివారం సాయంత్రం సీఎం సభా ఏర్పాట్లను కలెక్టర్‌ విజయకృష్ణన్‌, సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ సత్యనారాయణరాజు, ఎస్పీ తుహిన్‌ సిన్హాతో కలిసి పర్యవేక్షించారు. బందోబస్తు ఏర్పాట్లు, వీఐపీలు, ప్రజలు వచ్చే మార్గాలు, వాహనాల పార్కింగ్‌ తదితర అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా హోం మంత్రి అనితకు ఎస్పీ తుహిన్‌ సిన్హా వివరించారు. ట్రాఫిక్‌ నియంత్రణ కూడా పక్కాగా చేయాలని, ఎవరికీ ఇబ్బందులు కలగకూడదని హోం మంత్రి ఆదేశించారు. హెలీప్యాడ్‌, సభావేదిక పరిసరాలను హోం మంత్రి అనిత ,కలెక్టర్‌, ఎస్పీలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన సత్యనారాయణరాజు, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ బంగారురాజు, తదితరులు పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబునాయుడు రాక రేపు

అనకాపల్లి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 23న ఆర్సెలార్‌ మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌ భూమి పూజకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు జిల్లా ఉండవల్లి నుంచి ఆయన హెలీకాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి చేరుకుంటారు. 3.35 గంటలకు అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.40 గంటలకు పాటిమీద గ్రామంలో స్టీల్‌ప్లాంట్‌ భూమి పూజ జరిగే స్థలానికి చేరుకుంటారు. 3.55 గంటల వరకు ప్లాంట్‌ ఏర్పాటు స్థలాన్ని, బ్లూప్రింట్‌లను సీఎం స్వయంగా పరిశీలిస్తారు. సాయంత్రం 5.28 గంటలకు స్టీల్‌ప్లాంట్‌కు భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం 5.30 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి చంద్రనాడ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 5.40 గంటలకు హెలీకాప్ట్టర్‌లో బయలుదేరి 7.10 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు.

Updated Date - Mar 22 , 2026 | 12:03 AM