రీయింబర్స్‌మెంట్ బకాయిలపై స్పష్టత ఇవ్వాలి
ABN , Publish Date - Sep 13 , 2026 | 06:31 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జి దుర్మార్గం
అధికారికంగా విమోచన దినోత్సవం జరిపే వరకూ పోరాడతాం: రాంచందర్‌రావు
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఈ విషయమై బీఆర్‌ఎస్ సర్కారును బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన అవాస్తవమన్నారు. 2017 జనవరి నాలుగో తేదీన ఎమ్మెల్సీగా తాను ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థుల స్కాలర్‌షి్‌పలు, విద్యావ్యవస్థ దుస్థితిపై గళమెత్తిన అంశం మండలి రికార్డుల్లో ఉన్నదని గుర్తు చేశారు. బకాయిలు చెల్లించనందువల్లే పలు కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవో 97 ద్వారా స్కిల్ డెవల్‌పమెంట్‌ను ఇంటిగ్రేట్ చేసి.. పూర్తిగా పాలిటెక్నిక్ కోర్సులను ఎత్తేయడానికి కుట్ర చేస్తోందన్నారు. ఢిల్లీలో ‘చాత్రోంకీ గూంజ్ అని రాహుల్ గాంధీ ఉపన్యాసాలిస్తుంటే.. తెలంగాణలో మాత్రం లాఠీలతో విద్యార్థులను చితక బాదుతున్నారని మండి పడ్డారు. సమస్యల పరిష్కారానికి బీజేపీ కార్యకర్తలు కాలేజీలకెళ్లి సేకరించిన సుమారు 8 లక్షల మంది విద్యార్థుల సంతకాలతో కూడిన వినతి పత్రాలను సమర్పించడానికి సీఎం కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని రాంచందర్‌రావు ఆరోపించారు.
మరోవైపు, రిటైర్డు డీసీపీ శ్రీనివా్‌సతోపాటు సూర్యాపేట జిల్లాలోని ప్రముఖ వైద్యులు, వ్యాపారవేత్తలు, యువకులు బీజేపీలో చేరారు. వారికి రాంచందర్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, అబిడ్స్‌లోని మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో తెలంగాణ విమోచన కమిటీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ విమోచనం-జాతీయ వాదుల పాత్ర’ అనే అంశంపై జరిగిన సదస్సులో ముఖ్య వక్తగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. సెప్టెంబరు 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరిపే వరకూ పోరాడతామన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అత్యంత వైభవంగా, అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 17న ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోనూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే విమోచన దినోత్సవ వేడుకలకు వేలాదిగా తరలి రావాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
భార్య విలువ తెలిసి.. భర్త మనసు కరిగె..
వచ్చే 30 ఏళ్ల అవసరాల కోసమే క్యూర్
Read Latest AP News And Telangana News And International News And Telugu News