కరవుతో ఇబ్బందుల్లో రైతులు.. పంట రుణాల రీషెడ్యూల్‌కు భట్టి ఆదేశాలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 03:59 PM
రైతులకు బ్యాంకులు అండగా నిలవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని.. రైతులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 10: రైతులకు బ్యాంకులు అండగా నిలవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు(మంగళవారం) ప్రజాభవన్‌లో జరిగిన ప్రత్యేక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశానికి డిప్యూటీ సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని.. రైతులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు బ్యాంకులు ప్రత్యేక చొరవ చూపాలని... అర్హులైన రైతుల పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఆదేశించారు.
ఆ పంటలకు రుణాలు అందించాలి
రబీ సీజన్‌కు కొత్త పంట రుణాలను సకాలంలో అందించాలని భట్టి సూచించారు. బ్యాంకుల చుట్టూ రైతులు తిరిగే పరిస్థితి ఉండకూడదని తెలిపారు. విద్య, గృహ రుణాల మంజూరులో బ్యాంకులు సానుకూలంగా ఉండాలని నిర్దేశించారు. ఎంఎస్ఎంఈ, మౌలిక సదుపాయాల రంగాలకు రుణాలు పెంచాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 365 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించామని.. 111 మండలాల్లో తీవ్ర కరవు పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలకు రుణాలు అందించాలని.. పంటల మార్పిడి, సూక్ష్మ సేద్యానికి ఆర్థిక సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు.
అదనపు ఉపాధి కల్పించేలా చర్యలు
రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించాలని ఉపముఖ్యమంత్రి సూచించారు. 10 నుంచి 15 శాతం రైతు కుటుంబాలకు అదనపు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు అదనంగా రూ.2 లక్షల వరకు రుణాలపై పరిశీలన చేయాలని అన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వాలని నిర్దేశించారు. ఈ నెల 19 నాటికి రాజీవ్ యువ వికాసం అమలుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. రైతులు తదుపరి వ్యవసాయ సీజన్‌ను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో జడ్పీ ఛైర్‌పర్సన్, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
‘అగ్రికల్చర్ వర్సిటీ వీసీపై చర్యలు తీసుకోండి’.. గవర్నర్‌కు మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు
Read Latest Telangana News And Telugu News