Share News

‘భారత్‌ సమ్మిట్‌’కు 70 దేశాల ప్రతినిధులు!

ABN , Publish Date - Nov 11 , 2026 | 06:19 AM

ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం, అంతర్జాతీయ సహకారానికి నూతన విధానాలను అన్వేషించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ‘భారత్‌ సమ్మిట్‌-2026’ను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ విదేశీ వ్యవహారాల విభాగం చైర్మన్‌ సల్మాన్‌ ఖుర్షీద్‌ చెప్పారు.

‘భారత్‌ సమ్మిట్‌’కు 70 దేశాల ప్రతినిధులు!
Bharat Summit 2026

  • హైదరాబాద్‌లో రేపట్నుంచి 3 రోజుల పాటు సమ్మిట్‌:సల్మాన్‌ ఖుర్షీద్‌

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం, అంతర్జాతీయ సహకారానికి నూతన విధానాలను అన్వేషించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ‘భారత్‌ సమ్మిట్‌-2026’ను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ విదేశీ వ్యవహారాల విభాగం చైర్మన్‌ సల్మాన్‌ ఖుర్షీద్‌ చెప్పారు. హైదరాబాద్‌ వేదికగా ఈ నెల 12, 13, 14 తేదీల్లో జరిగే ఈ సమ్మిట్‌కు దాదాపు 70 దేశాల నుంచి రాజకీయ నాయకులు, విధానకర్తలు, విద్యావేత్తలు, వ్యాపారులు హాజరుకానున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, సీడబ్ల్యూసీ సభ్యుడు గుర్దీప్‌ సప్పల్‌తో కలిసి మీడియాకు భారత్‌ సమ్మిట్‌ వివరాలను వెల్లడించారు.


ప్రజాస్వామ్యం, సామాజిక-ఆర్థిక న్యాయం, వాతావరణ మార్పులు, లింగ సమానత్వం, విదేశాంగ విధానం, మారుతున్న ప్రపంచ వ్యవస్థపై సమ్మిట్‌లో చర్చించనున్నట్లు సల్మాన్‌ ఖుర్షీద్‌ తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్‌ క్యాపిటలిజం, అంతర్జాతీయ సంబంధాల వంటి అంశాలపై ప్రతినిధులు ఆలోచనలు పంచుకుంటారని పేర్కొన్నారు. గ్లోబల్‌ నార్త్‌, గ్లోబల్‌ సౌత్‌ దేశాల మధ్య పరస్పర సకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమ్మిట్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను గమనిస్తే అత్యంత కీలక సమయంలో ఈ సదస్సు జరుగుతోందని ఖర్షీద్‌ అన్నారు. ప్రపంచంలో ఒక ‘నూతన వ్యవస్థ’ ఆవిర్భవిస్తోందని, దానికి సరైన రూపునివ్వడంలో కాంగ్రెస్‌ పార్టీ కీలక పాత్ర పోషించగలదని చెప్పారు. 2029లో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటే తమ లక్ష్యమన్నారు. ‘లావాదేవీల ఆధారిత విదేశాంగ విధానానికి’ కాంగ్రెస్‌ వ్యతిరేకమని, ‘సిద్ధాంతపరమైన విధానానికే’ మద్దతు ఇస్తుందని తెలిపారు.


ప్రత్యేక ఆకర్షణగా ‘తెలంగాణ రైజింగ్‌’ థీమ్‌

సదస్సులో ‘తెలంగాణ రైజింగ్‌’ థీమ్‌తో ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం, పట్టణీకరణ, సంస్కృతి, క్రీడలు వంటి రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించనున్నట్లు చెప్పారు. త్వరలో జరగబోయే ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ సమ్మిట్‌’లో రాష్ట్ర ఆర్థిక విధానాలు, ఫ్లాగ్‌షిప్‌ ప్రోగ్రామ్‌లను ప్రపంచానికి వివరించి, భారీగా పెట్టుబడులు సాధించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి రాహుల్‌తో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రియాంకలను ఆహ్వానించామని తెలిపారు. రెండో సారి భారత్‌ సమ్మిట్‌ నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌ అన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతరాహుల్‌ గాంధీ 14వ తేదీన భారత్‌ సమ్మిట్‌ ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం గిగ్‌ వర్కర్లతో భేటీ అయ్యి, అదే రోజు రాత్రి న్యూఢిల్లీ తిరుగు ప్రయాణమవుతారని పేర్కొన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!

రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్‌!

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 06:19 AM