కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!: సజ్జనార్
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:35 PM
వేసవి కాలంలో లభించే సీజనల్ ఫ్రూట్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండే పండ్లను చూసి మోసపోవద్దంటూ ఎక్స్ వేదికగా ఆయన కొన్ని సూచనలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: వేసవి సీజన్ ప్రారంభమైందంటే చాలు.. సీజనల్ ఫ్రూట్ మామిడికి ఎనలేని ఆదరణ లభిస్తుంది. పండ్లలో రారాజుగా ప్రసిద్ధి చెందిన మామిడిలో రుచి, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినివ్వడమే కాకుండా జీర్ణక్రియనూ మెరుగుపరుస్తాయి. అయితే.. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు కల్తీ మామిడి విక్రయాలకు పాల్పడటం ఆందోళనకు గురిచేసే విషయం. మామిడి పండ్లను రసాయనాలతో(కాల్షియం కార్బైడ్) కృత్రిమంగా పండించి విక్రయిస్తున్న వ్యాపారుల పట్ల జాగ్రత్త అవసరం. ఈ కల్తీ పండ్ల వల్ల ఆరోగ్య సమస్యలు రావడమే కాకుండా క్యాన్సర్ ముప్పూ పొంచి ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ విషయమై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ.సజ్జానార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
వేసవి కాలం రాకతో పండ్లలో రారాజు మామిడి మార్కెట్‌లో సందడి చేస్తోందని సజ్జనార్ అన్నారు. అయితే.. నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషకోరలు దాగున్నాయన్న నిజాన్ని ప్రజల మరవకూడదని హెచ్చరిస్తూ.. 'కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!' అని ఎక్స్ వేదికగా వివరించారు. మార్కెట్లలో ఎక్కడైనా కల్తీ మామిడి పండ్లను విక్రయించినా, ఆ సమాచారం తెలిసినా వెంటనే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబర్ 8712661212కు కాల్ చేయాలని సూచించారు సజ్జనార్.
ఇవీ చదవండి:
అన్ని శాఖలకు ముఖ్యమంత్రే మంత్రిగా ఉండటం మన కర్మ: కవిత
గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు.. సీఎం రేవంత్ స్పందన