అత్యాధునిక యుద్ధనౌక 'INS తారాగిరి' విశాఖలో జలప్రవేశం
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:05 PM
భారత నౌకాదళ చరిత్రలో నేడు మరో కీలక ఘట్టం లిఖితమైంది. అత్యాధునిక యుద్ధనౌక 'INS తారాగిరి' ఈ ఉదయం విశాఖపట్నంలో జలప్రవేశం చేసింది. క్షిపణులు, అత్యాధునిక సెన్సార్లు, పవర్ ఫుల్ గన్స్‌తో కూడిన మన దేశ మరో కొత్త వార్ షిప్ ఇది.
విశాఖపట్నం, ఏప్రిల్ 3: భారత నౌకాదళ చరిత్రలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక యుద్ధనౌక 'INS తారాగిరి' (INS Taragiri) జలప్రవేశం చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కమిషనింగ్ వేడుక ఆహ్లాదకరంగా సాగింది.
భారత తూర్పు నౌకాదళానికి కొత్త బలం:
తారాగిరి జలప్రవేశంతో భారత సముద్ర సరిహద్దుల రక్షణలో మరో సరికొత్త అధ్యాయం మొదలైంది. స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 'ప్రాజెక్ట్ 17A' శ్రేణిలోని యుద్ధనౌక ఇది. నేడు అధికారికంగా భారత నౌకాదళంలో చేరింది. ఈ అత్యాధునిక యుద్ధనౌక చేరికతో ముఖ్యంగా తూర్పు నౌకాదళం (Eastern Naval Command) మరింత పటిష్ఠం కానుంది.
INS తారాగిరి ప్రత్యేకతలు:
స్టీల్త్ ఫ్రిగేట్: శత్రువుల రాడార్లకు చిక్కకుండా ప్రయాణించగలిగే 'స్టీల్త్' టెక్నాలజీతో దీనిని రూపొందించారు. ముంబైలోని మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) దీనిని నిర్మించింది. ఇది 'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా నిర్మించిన అత్యంత శక్తివంతమైన నౌకలలో ఒకటి. భూమి నుంచి ఆకాశంలోకి, సముద్రం నుంచి సముద్రంలోకి దాడి చేయగల క్షిపణులు (Missiles), అత్యాధునిక సెన్సార్లు, శక్తివంతమైన తుపాకులతో దీనిని అమర్చారు. దాదాపు 149 మీటర్ల పొడవు, 17.8 మీటర్ల వెడల్పు గల ఈ నౌక గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.
వ్యూహాత్మక ప్రాముఖ్యత:
హిందూ మహాసముద్ర ప్రాంతంలో (IOR) చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో, INS తారాగిరి కమిషనింగ్ అత్యంత కీలకంగా మారింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతిని కాపాడటంతో పాటు, భారత సముద్ర ప్రయోజనాలను రక్షించడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.