అంకెల ఆర్భాటాలు.. కేటాయింపుల ప్రగల్భాలే: బండి సంజయ్
ABN , Publish Date - Mar 20 , 2026 | 04:58 PM
తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ తీవ్రంగా విమర్శించారు. ‘మోసం.. దగా.. ప్రజా వంచన బడ్జెట్ ఇది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. ఆదాయాన్ని పండబెట్టి.. అప్పుల కోసం అర్రులు చాచే బడ్జెట్ ఇది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో రూ.లక్ష కోట్ల అదనపు అప్పు భారం ప్రజలపై మోపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవడం సిగ్గు చేటని అన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించడంలో కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టిందని అన్నారు. కేంద్రంపై ఆధారపడటం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకేమీ చేయలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
రైతు భరోసా నిధులు రెండు విడతలు ఎగ్గొట్టినట్లేనా అని కేంద్రమంత్రి ప్రశ్నించారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీల నోట్లో మళ్లీ మట్టి కొట్టారని ఆరోపించారు. ‘మహిళలను మళ్లీ వంచించారు... తులం బంగారం తుస్.. రూ.2,500లు నిల్’ అని అన్నారు. అవ్వాతాతల నోట్లో మట్టి కొట్టారని.. రూ.4 వేల పెన్షన్ పెంపు గురించి ఊసే లేదని విమర్శించారు. నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని.. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి అంశమే లేదని ఆయన అన్నారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు అంటూ ప్రకటించినా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తెలిపారు. ఆరు గ్యారంటీలకు పాడె కట్టే బడ్జెట్ ఇదని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీకి కేటాయింపుల కంటే గత బకాయిలే ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.
విద్యకు 16 శాతం నిధులు కేటాయించాలని విద్యాశాఖ కమిషన్ ప్రతిపాదించినా 8 శాతానికే పరిమితం చేశారని బండి సంజయ్ విమర్శించారు. దేవాదాయ శాఖకు గత బడ్జెట్‌లో రూ.190 కోట్లు కేటాయించినా ఈసారి ప్రస్తావనే లేదని అన్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు కంటి తుడుపు కేటాయింపులు మాత్రమే ఇచ్చారని తెలిపారు. 56 శాతం బీసీ జనాభాకు కేవలం 4 శాతం మాత్రమే కేటాయింపులు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కూడా బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. మైనారిటీలకు గతేడాది కంటే ఎక్కువ నిధులు కేటాయించడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని ఆర్థిక మంత్రి చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు. దావోస్, గ్లోబల్ సమ్మిట్ పేరుతో వచ్చిన పెట్టుబడుల వివరాలు వెల్లడించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. రెండేళ్లలో దిగిపోయే ప్రభుత్వమే కదా అని.. ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ చేసిన అప్పుల భాగోతంపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా
బీసీల ఆగ్రహం చూస్తారు.. ప్రభుత్వంపై గంగుల కమలాకర్ ఫైర్
Read Latest Telangana News And Telugu News