Share News

కాంగ్రెస్ నేతలకు కంటి పరీక్షలు చేయించాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్

ABN , Publish Date - Jul 10 , 2026 | 04:21 PM

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎంఐఎం పార్టీని లక్ష్యంగా చేసుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటు విమర్శలు చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఫాతిమా మహిళా కళాశాల.. సకలం చెరువు పరిధిలో ఉందని బండి సంజయ్ మరోసారి ఆరోపించారు.

కాంగ్రెస్ నేతలకు కంటి పరీక్షలు చేయించాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్
Union Minister Bandi Sanjay

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎంఐఎం పార్టీని లక్ష్యంగా చేసుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటు విమర్శలు చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఫాతిమా మహిళా కళాశాల.. సకలం చెరువు పరిధిలో ఉందని బండి సంజయ్ మరోసారి ఆరోపించారు. ఇది ప్రపంచమంతా చూస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చూడనట్లు నటిస్తోందని ఆయన మండిపడ్డారు. పేదల ఇళ్లను హైడ్రా (HYDRAA) పేరుతో కూల్చివేస్తున్న ప్రభుత్వం.. అందరికీ కనిపిస్తున్న ఈ ఆక్రమణను మాత్రం ఎందుకు గుర్తించలేకపోతోందని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బండి సంజయ్ పోస్టు పెట్టారు.


ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు వెంటనే కంటి పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉందంటూ బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ నేతల కోసం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఉచిత కంటి పరీక్షా శిబిరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆ పరీక్షల తర్వాత కూడా వారికి చెరువు పక్కన కళాశాల కనిపించకపోతే సమస్య కళ్లలో కాదు.. వారి రాజకీయాల్లోనే ఉందని అర్థం చేసుకోవాలన్నారు. మరోవైపు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. కాంగ్రెస్ ఎక్కడ రాజకీయ రంగోలి వేయాలనుకుంటే అక్కడ ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) గీతలు వారి మిత్రులకు అనుకూలంగా మారిపోతున్నాయంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ తనకు అనుకూలంగా వ్యవస్థలను వినియోగిస్తోందని కేంద్ర మంత్రి ఆరోపించారు.


కాగా, సకలం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఒవైసీ కాలేజీ ఉందనే అంశంపై ఇటీవల రాజకీయంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా బండి సంజయ్ చేసిన పోస్టు.. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి దుమారం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో బోనాల సందడి.. జులై 16 నుంచి ప్రారంభం

హరీశ్ కాంగ్రెస్‌లోకి వస్తానంటే చర్చిస్తాం: మహేశ్ కుమార్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 10 , 2026 | 05:15 PM