రైతులను వెంటనే ఆదుకోవాలి: సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ
ABN , Publish Date - May 01 , 2026 | 03:45 PM
రాష్ట్రంలోని రైతులను వెంటనే ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్నదాతలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుంటే ఆందోళన తప్పదని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన హెచ్చరించారు.
కరీంనగర్, మే1: రాష్ట్రంలోని రైతులను వెంటనే ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్నదాతలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుంటే ఆందోళన తప్పదని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన హెచ్చరించారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
అన్నదాతల ఆశలు సమాధి చేశారు.. ఆరుగాలం కష్టాన్ని ఆవిరి చేస్తారా? అంటూ రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. తాలు, తరుగు, తేమ లేకుండా వడ్లు కొంటామని ఇచ్చిన హామీని సమాధి చేశారా? అంటూ ఆయనను సూటిగా ప్రశ్నించారు. మీ కళ్ల ముందే తాలు, తేమ పేరుతో రైతులను నిలువునా ముంచుతున్నా పట్టించుకోరా? అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మండుటెండల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులు మీకు పట్టవా? అంటూ సీఎంను బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు. వడ్లకు బోనస్ హామీ అంతా ఉత్తిదేనా? అని నిలదీశారు. గత రబీ సీజన్‌కూ బోనస్ ఎగ్గొట్టారని.. ఈ సీజన్‌లో బోనస్‌కు పాతరేసినట్లేనా? అంటూ సీఎం రేవంత్‌పై మండిపడ్డారు.
పత్తి పంటకు ఎం.ఎస్.పి(కనీస మద్దతు ధర) ఎగ్గొట్టి రైతులను ముంచారని రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్నకు కేంద్రం ఎం.ఎస్.పి ఇస్తున్నా కొనుగోలు బాధ్యతను విస్మరించి.. దళారులకు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా ఈ రెండున్నరేళ్లలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఏం చేశారంటూ? సీఎం రేవంత్‌ను ఆయన బల్ల గుద్ది ప్రశ్నించారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.5 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని.. కానీ రూ.260 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటారా? అంటూ సీఎం తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.
దళారులకు దోచిపెట్టి.. రైతులను రోడ్డున పడేయడమే మీ విధానమా? అంటూ తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. పౌరసరఫరాల సంస్థను అప్పుల ఊబిలోకి నెడతారా? అంటూ నిలదీశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.56 వేల కోట్ల అప్పుతో పౌర సరఫరాల శాఖ కార్పోరేషన్‌ను దివాలా తీయించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ రెండున్నరేళ్లలో ఈ సంస్థను రూ. లక్ష కోట్ల అప్పుల పాలు చేసిందని వివరించారు.
వరంగల్ డిక్లరేషన్‌ను పాతి పెట్టేశారు.. రాయపూర్ ఏఐసీసీ రైతు తీర్మానాలకు తిలోదకాలిచ్చారా? అంటూ సీఎంను బండి సంజయ్ ఈ బహిరంగ లేఖ ద్వారా నిలదీశారు. ఈ రబీ సీజన్‌లో రైతుల వేతలపై మీరు ఏనాడైనా సమీక్షించారా?.. రాష్ట్రంలో వడగాల్పులతో జనం అల్లాడుతుంటే మీ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి నిద్రపోతున్నారా?.. ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం ఎండలు మండిపోతుంటే.. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఏది? ఎక్కడా? అంటూ తెలంగాణ సీఎంకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా ప్రశ్నలు సంధించారు.
కరప్షన్, కలెక్షన్, ల్యాండ్ సెటిల్‌మెంట్లు తప్ప రైతుల కన్నీటి వెతలతో మీకు పని లేదా?.. నమ్మి ఓటేసిన పాపానికి అన్నదాతలను నట్టేట ముంచుతారా?.. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర పడినా మీలో చలనం లేదా? అంటూ సీఎం రేవంత్‌కు ఈ లేఖ ద్వారా కేంద్ర మంత్రి బండి సంజయ్ చురకలంటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొద్ది రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతం: కేంద్ర మంత్రి పెమ్మసాని
తెలంగాణ డీజీపీ నియామకంపై హైకోర్టు ఏం చెప్పిందంటే..
For More TG News And Telugu News