కల్తీసారా తాగొద్దంటే బద్నాం చేస్తారా?.. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్
ABN , Publish Date - Mar 31 , 2026 | 03:02 PM
తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆరోపించారు. కల్తీసారా తాగకండి అంటే తనను బద్నాం చేస్తారా? అంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, మార్చి 31: తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆరోపించారు. కల్తీసారా తాగకండి అంటే తనను బద్నాం చేస్తారా? అంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులకు ప్రైవసీ అనేది లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ఆదివాసీలు లిక్కర్ తయారుచేస్తే తప్పా? కార్పొరేట్ కంపెనీలు చేస్తే కరెక్టా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పసారాకు 3 వేల ఏళ్ల చరిత్ర ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇప్పసారా ఇండియన్ లిక్కర్ అని ఆయన అభివర్ణించారు.
ఈ సందర్భంగా సినీతారలపై అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను డ్రగ్ టెస్ట్ చేయించుకున్నానని.. అలాగే సినీతారలు కూడా టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచించారు. వారిపైనే అధికంగా డ్రగ్స్ ర్యూమర్స్ ఉన్నాయని గుర్తుచేశారు. కానీ రాజకీయ నాయకులపై ఈ పుకార్లు తక్కువేనన్నారు. ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలంటూ సినీనటులకు సూచించారు. డ్రగ్ టెస్ట్‌లో నెగెటివ్ వస్తేనే షూటింగ్స్‌లో పాల్గొనేందుకు అనుమతించాలని ఆయన స్పష్టం చేశారు.
డ్రగ్స్ బారినపడిన వారు చిత్ర పరిశ్రమలలోనే అధికంగా ఉన్నారని ప్రజలు భావిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. సీఎం రేవంత్ మద్యం, ధూమం వంటివాటికి దూరంగా ఉంటారన్నారు. తాము కూడా డ్రగ్స్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నామని అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇప్పసారాకు శతాబ్దాల చరిత్ర ఉందని అనిరుధ్‌రెడ్డి ఇటీవల వెల్లడించారు. ఈ రకమైన సారా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. గతంలో దీన్ని తాగి 110 ఏళ్లు బతికారని ఆయన వివరించారు. అనిరుధ్ వ్యాఖ్యలపై ప్రజలు తమదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. నిలిచిన రాకపోకలు
జోరుగా కల్తీ వంట నూనె దందా.. భోజన ప్రియుల్లో ఆందోళన
Read Latest Telangana News And Telugu News