జోరుగా కల్తీ వంట నూనె దందా.. భోజన ప్రియుల్లో ఆందోళన
ABN , Publish Date - Mar 31 , 2026 | 10:48 AM
హైదరాబాద్‌లో కల్తీ వంట నూనె విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 20 డబ్బాల్లో కల్తీ నూనెను పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్, మార్చి 31: హైదరాబాద్‌లో కల్తీ వంట నూనె దందా తీవ్ర కలకలం రేపుతోంది. హైటెక్ సిటీలో కల్తీ వంట నూనె విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. హోటళ్లలో వాడిన వంటనూనెను కిలోకు రూ.20కు సేకరిస్తున్న ముఠా... దాన్ని వీధి వ్యాపారులకు రూ.70కు అమ్ముతున్నట్లు బయటపడింది. లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ముఠా గుట్టు బయటపడింది. నాచారం ప్రాంతంలో శుద్ధి పేరుతో మళ్లీ ప్యాకెట్లలో నింపుతూ దందా చేస్తోంది ముఠా.
సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు... కల్తీ నూనె సేకరిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని రెస్టారెంట్ల నుంచి వాడిన నూనెను సేకరించి.. కర్ణాటక రిజిస్ట్రేషన్ ఆటోలో వందల లీటర్లు తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 20 డబ్బాల్లో కల్తీ నూనెను గుర్తించారు. నిందితులు పత్రాలు చూపించలేక తప్పించుకునే ప్రయత్నం చేశారు.
చివరకు వీధి వ్యాపారులకు కల్తీ వంట నూనెను అమ్ముతున్నట్లు పోలీసుల ఎదుట ముఠా సభ్యులు ఒప్పుకున్నారు. మొత్తం ముఠాను అరెస్ట్ చేయాలని స్థానిక నేత దుర్గం శ్రీహరి గౌడ్ డిమాండ్ చేశారు. ఆర్టీఏ, పోలీసులు, జీఎస్టీ అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి.
ఇవి కూడా చదవండి...
ఒంటిమిట్టలో ఘనంగా కోదండరాముని బ్రహ్మోత్సవాలు..
నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. నిలిచిన రాకపోకలు
Read Latest Telangana News And Telugu News