వైద్యశాఖలో 45 శాతం ఖాళీలే
ABN , Publish Date - Mar 31 , 2026 | 06:11 AM
రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థలో తీవ్రమైన లోపాలున్నాయని కాగ్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 45 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని...
మందుల సరఫరా లేక నిలిచిన రూ.771 కోట్ల ఇండెంట్
మలక్‌పేట ఆస్పత్రిలో రెండేళ్లపాటు వినియోగంలో లేని కొత్త వెంటిలేటర్లు
నిర్మాణ కార్మికుల భద్రత ప్రశ్నార్థకం: కాగ్
హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థలో తీవ్రమైన లోపాలున్నాయని కాగ్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 45 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆరోగ్య సేవల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, మందుల సరఫరాలో భారీ నిర్లక్ష్యం నెలకొందని తెలిపింది. 2016-17 నుంచి 2021-22 మధ్య వైద్య ఆరోగ్యశాఖపై కాగ్ నిర్వహించిన ఆడిట్ నివేదికను తాజాగా సర్కారు విడుదల చేసింది. దీని ప్రకారం.. వైద్యశాఖలో 45 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య కళాశాలల్లో అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉండటంతో భవిష్యత్ వైద్యుల ప్రమాణాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందది. పల్లె దవాఖానల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌లో ఔషధాలు లేకపోవడంతో 2019-22 మధ్య కాలంలో రూ.771.75 కోట్ల విలువైన మందుల ఇండెంట్ సరఫరా చేయలేకపోయారు. పలు ఆస్పత్రుల్లో వైద్య యంత్ర పరికరాలు నిరుపయోగంగా మారాయి. మలక్‌పేట ఆసుపత్రికి పంపిన 25 వెంటిలేటర్లను దాదాపు రెండేళ్ల పాటు ప్రారంభించలేదు. వైద్య ఉన్నతాఽధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని కాగ్ తెలిపింది. కొన్నిచోట్ల ఆస్పత్రుల భవనాల నిర్మాణం పూర్తి అయినా వాటిని వినియోగంలోకి తీసుకురాలేదు. కేటాయించిన బడ్జెట్ నిధులు పూర్తిగా విడుదల చేయలేదు. 2017-18లో 40శాతం ఉన్న సిజేరియన్ ప్రసవాలు 2021-22 నాటికి 61 శాతానికి చేరాయి.
నిధులు ఖర్చు పెట్టలేదు
జీహెచ్‌ఎంసీతోపాటు పలు మునిసిపాలిటీల్లో జరిగిన అవకతవకలను కాగ్ ఎత్తిచూపింది. 2012 ఫిబ్రవరి నుంచి 2020 జూలై వరకు 44.16 లక్షల మెట్రిక్ టన్నుల పొడి వ్యర్థాల శుద్ధి, నిర్మూలన చార్జీల కింద జీహెచ్‌ఎంసీ రూ.313.20 కోట్ల మొత్తాన్ని సంబంధిత ఏజెన్సీకి చెల్లించింది. కానీ, ఆ సంస్థ పొడి చెత్త ప్రాసెస్ నిర్వహణ పనులు చేయనేలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల నిర్వహణ విధానాన్ని ప్రకటించలేదని (2023 సెప్టెంబరు నాటికి) కాగ్ పేర్కొంది. భవన నిర్మాణ కార్మికుల ప్రయోజనాలను కాపాడటంలో సంబంధిత సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని.. నిబంధనల ఉల్లంఘన జరిగిందని తెలిపింది. 2018 అక్టోబరులో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కాలపరిమితి ముగియగా.. చైర్మన్‌తో కలిపి ఎనిమిది మంది సభ్యులతో పునరుద్ధరణ చేయాల్సి ఉన్నా.. కేవలం ముగ్గురితో బోర్డు ఏర్పాటు చేశారని పేర్కొంది. ఏపీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుంచి తెలంగాణ బోర్డుకు రావాల్సి ఉన్న రూ.431 కోట్లను వసూలు చేయడం లేదని తెలిపింది. బోర్డులో నమోదు కాని వారికి రూ.16 లక్షల నగదు పంపిణీ చేయడాన్ని కాగ్ తప్పు పట్టింది.