అంబేడ్కరిజంతోనే మావోయిస్టు కోటలకు బీటలు
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:53 AM
భారత మావోయిస్టులు, వారి ఉద్యమంపై లోతైన పరిశోధన చేసిన భద్రతా నిపుణుడు పీవీ రమణ రచించిన ‘ఇండియాస్ మావోయిస్ట్స్-గ్లింప్సెస్ ఇన్టు రెడ్ ఇన్సర్జెన్సీ’ పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించారు.
‘ఇండియాస్ మావోయిస్ట్స్’ పుస్తకావిష్కరణలో
రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహదారు శివధర్‌రెడ్డి
ఆచితూచి కేంద్ర బలగాల ఉపసంహరణ..
మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు
196 జిల్లాల రెడ్ కారిడార్ నుంచి పతనం దిశగా పయనం: రచయిత రమణ
హైదరాబాద్, అక్టోబర్ 28 (ఆంధ్రజ్యోతి): భారత మావోయిస్టులు, వారి ఉద్యమంపై లోతైన పరిశోధన చేసిన భద్రతా నిపుణుడు పీవీ రమణ రచించిన ‘ఇండియాస్ మావోయిస్ట్స్-గ్లింప్సెస్ ఇన్టు రెడ్ ఇన్సర్జెన్సీ’ పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు, మాజీ డీజీపీ బి.శివధర్‌రెడ్డి, ఏపీ మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. అన్ని ప్రభుత్వ విభాగాలు, పోలీసు బలగాల సమష్టి కృషితో నక్సలిజం ప్రభావం తగ్గిందని శివధర్‌రెడ్డి అన్నారు. వాస్తవానికి నక్సలైట్లతో చర్చలు జరగడానికి ముందే.. రాజ్యాంగ హక్కులు, సామాజిక న్యాయాన్ని చాటిచెప్పే అంబేడ్కరిజం భావజాలమే ప్రజల్లో విస్తృత చైతన్యాన్ని తెచ్చిందని.. మావోయిస్టుల ప్రచారాన్ని తిప్పికొట్టిందని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల విస్తృతి పెరగడం యువత, వారి తల్లిదండ్రులకు మావోయిస్టుల పట్ల దృక్పథంలో మార్పు తీసుకువచ్చాయన్నారు.
ప్రభుత్వాలు తొలిదశలో నక్సలిజాన్ని స్థానిక సమస్యగా పరిగణించాయని.. తర్వాత దీర్ఘకాలిక సమస్యగా గుర్తించి తగిన వ్యూహాలతో గ్రేహౌండ్స్, ఎస్ఐబీ వంటి విభాగాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. నక్సలైట్లతో చర్చలకు నాటి సీఎం వైఎస్ఆర్ తెరతీశారని, ఆ తర్వాతి పరిణామాలతో ఇరువైపులా కొంత నష్టం కొంత ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇక నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఎన్నో ప్రత్యేక విధానాలు అవలంబించిందని మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. మావోయిస్టుల ముగింపులో సైతం ఏపీ, తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారన్నారు. శాశ్వత శాంతి కోసం నిరంతర నిఘాతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేయాలని సూచించారు. మావోయిస్టు ప్రాంతాల నుంచి కేంద్ర బలగాల ఉపసంహరణ ఆచితూచి జరగాలని.. కీలక అటవీ ప్రాంతాల్లో కీలక స్థావరాలను కొనసాగించాలని పేర్కొన్నారు.
నగరాల్లోని మావోయిస్టుల రహస్య నెట్‌వర్క్‌లను, అక్రమ నిధులను ఇంకా కట్టడి చేయాలన్నారు. ఇక దాదాపు పాతికేళ్ల క్రితం 196 జిల్లాల్లో నక్సలైట్ల సమస్య ఉందని.. రెడ్‌కారిడార్ విస్తరణకు అదే అవకాశంగా మారిందని పుస్తక రచయిత పీవీ రమణ చెప్పారు. మావోయిస్టు పార్టీ నిర్మాణం, ప్రజా సంఘాలు, అర్బన్ నెట్‌వర్క్‌లు, మహిళా క్యాడర్, ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాల వివరాలన్నీ పుస్తకంలో పొందుపరిచామన్నారు. అడవులు, నగరాల్లో కోట్లాది రూపాయల నగదు, బంగారు బిస్కట్ల డంపులు, ప్రధాన సాయుధ దాడులు, లొంగుబాటు విధానాల్లోని లోపాలను విశ్లేషించామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్, శాంతి భద్రతల విభాగం డీజీ మహేశ్ మురళీధర్ భగవత్, గ్రేహౌండ్స్ డీజీ అనిల్‌కుమార్, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, పలువురు మాజీ పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్రాధాన్య పోస్టుకు జయేశ్ రంజన్
ఆ జూనియర్ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News