Share News

లంచం సొమ్ము.. వైన్స్‌, షేర్‌ మార్కెట్‌లో..!

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:56 AM

అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా సంపాదించిన సొమ్మును వైన్స్‌లో పెట్టుబడులుగా పెట్టారు. షేర్‌ మార్కెట్లో పెట్టారు. ఆస్తులు, బంగారం కొన్నారు.

లంచం సొమ్ము.. వైన్స్‌, షేర్‌ మార్కెట్‌లో..!
Gundu Vani ACB Raid

  • స్థలాలు, ఇళ్లు, వాహనాలు కొన్నారు..

  • మొయినాబాద్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి

  • వాణి అక్రమాస్తులు రూ.50 కోట్లు

  • ఆమె ఇల్లు సహా 8 చోట్ల ఏసీబీ సోదాలు

  • రెండు ప్లాట్లు, ఒక ఫ్లాట్‌, జీ+2 భవనం, వ్యవసాయ భూముల గుర్తింపు

హైదరాబాద్‌/రాజేంద్రనగర్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా సంపాదించిన సొమ్మును వైన్స్‌లో పెట్టుబడులుగా పెట్టారు. షేర్‌ మార్కెట్లో పెట్టారు. ఆస్తులు, బంగారం కొన్నారు. ఇదీ మొయినాబాద్‌ మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి గుండు వాణి తీరు. ఇటీవల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డ వాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆమెకు రూ.6.76 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. అయితే ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం ఈ ఆస్తుల విలువ సుమారు రూ.50 కోట్ల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.


రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులు సోమవారం వాణి నివాసంతోపాటు కార్యాలయం, బంధువులు, సన్నిహితులు, బినామీలకు చెందిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్థిర, చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు, బ్యాంకు నిల్వలు, పెట్టుబడులను గుర్తించారు. ఏసీబీ గుర్తించిన స్థిరాస్తుల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో 283.11 చదరపు గజాల ప్లాట్‌, జనగామ జిల్లా పాలకుర్తిలో 424 చదరపు గజాల ప్లాట్‌ ఉన్నాయి. వీటి విలువ రూ.87.67 లక్షలుగా అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో రూ.63 లక్షల విలువైన ఒక నివాస ఫ్లాట్‌, అదే ప్రాంతంలో సుమారు రూ.2.45 కోట్ల విలువైన జీ+2 అంతస్తుల భవనాన్ని గుర్తించారు.


మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌కొండ మండలంలో ఎకరం 10 గుంటల వ్యవసాయ భూమి ఉండగా, దీని విలువ రూ.29.70 లక్షలుగా లెక్కగట్టారు. వాణి చరాస్తుల విషయానికి వస్తే.. రూ.5.47 లక్షల నగదు, మహబూబ్‌నగర్‌లోని తుల్జాభవానీ వైన్స్‌లో రూ.50 లక్షల పెట్టుబడి, షేర్లలో రూ.1.30 కోట్ల పెట్టుబడులను ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంకు ఖాతాల్లో రూ.7.97 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. సుమారు 175.1 గ్రాముల బంగారు ఆభరణాలు, మహీంద్రా ఎక్స్‌యూవీ 700, హ్యుందాయ్‌ క్రెటా కార్లతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు కలిపి రూ.50 లక్షల విలువైన వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లోని వస్తువుల విలువ మరో రూ.5.10 లక్షలుగా లెక్కించారు.


ఇప్పటికే లంచం కేసులో అరెస్టు..

గత సెప్టెంబరు 30న గుండు వాణి ఏసీబీకి చిక్కారు. మొయినాబాద్‌ పరిధిలో ఓ నిర్మాణానికి సంబంధించి రూ.75 వేల లంచం తీసుకున్న కేసులో గుండు వాణితో పాటు సీనియర్‌ అసిస్టెంట్‌ సుదర్శన్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Updated Date - Nov 17 , 2026 | 03:56 AM