నరహరి నివాసంలో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు
ABN , Publish Date - Jun 16 , 2026 | 02:34 PM
అవినీతి, భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగుతున్నారు. తాజాగా ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
హైదరాబాద్, జూన్ 16: భారీ అక్రమ ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ల్యాండ్ అండ్ సర్వే మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. మంగళవారం ఉదయం నుంచి చేపట్టిన ఈ సోదాల్లో కోటి నలభై లక్షల రూపాయిలు గుర్తించినట్లు తెలిపారు. అలాగే కేజీ బంగారాన్ని గుర్తించామన్నారు. ఇంత భారీ మొత్తంలో నగదు ఎందుకు ఉందనే అంశంపై నరహరిని ప్రశ్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
నరహరి నివాసంలో బ్యాంక్ డిపాజిట్లు (ఎఫ్‌డీ)లు కూడా దాదాపు రూ. కోటి వరకు ఉన్నాయని డీఎస్పీ శ్రీధర్ వివరించారు. నరహరి పేరు మీద రెండు బ్యాంక్ లాకర్లు కూడా గుర్తించామన్నారు. వీటిని తనిఖీ చేసేందుకు అనుమతి కోసం బ్యాంకుకు లేఖ రాశామన్నారు. రెండు మూడు రోజుల్లో ఆ లాకర్లు ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం నరహరి నివాసంలో ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులు విలువ రూ. 5 కోట్ల ఉంటుందని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తులు విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని ఆయన వివరించారు.
నరహరి నివాసంతోపాటు అతడి బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఏసీబీ శ్రీధర్ చెప్పారు. సర్వే భవన్‌లోని నరహరి కార్యాలయంలో సోదాలు చేస్తున్నామన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారా? లేదా? అనే విషయంపై నరహరిని విచారిస్తున్నామని తెలిపారు. ఈ రోజు సాయంత్రం సోదాలు పూర్తయిన తర్వాత నరహరిని అరెస్టు చేస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి బండి సంజయ్
Read Latest Telangana News And Telugu News