డిగ్రీకి క్లోజింగ్ బెల్!
ABN , Publish Date - Sep 26 , 2026 | 06:00 AM
ఇది నల్గొండ జిల్లా కేంద్రంలోని నీలగిరి ప్రైవేటు డిగ్రీ కాలేజీ... 4 దశాబ్దాల క్రితం ప్రారంభమై నల్గొండలోనే ప్రముఖ కాలేజీగా పేరుగాంచిన ఈ విద్యాసంస్థ.. గతేడాది మూతపడింది.
రాష్ట్రంలో ఐదేళ్లలో 335 ప్రైవేటు కాలేజీల మూత
ఏటా దాదాపు 50 కళాశాలలకు తాళం
జిల్లా కేంద్రాల్లోని కాలేజీల నిర్వహణ గగనమే
దోస్త్‌లో 35శాతం కూడా నిండని సీట్లు
ఈ ఏడాది 56 కాలేజీల్లో సున్నా ప్రవేశాలు
నేటి నుంచి కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు
హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇది నల్గొండ జిల్లా కేంద్రంలోని నీలగిరి ప్రైవేటు డిగ్రీ కాలేజీ... 4 దశాబ్దాల క్రితం ప్రారంభమై నల్గొండలోనే ప్రముఖ కాలేజీగా పేరుగాంచిన ఈ విద్యాసంస్థ.. గతేడాది మూతపడింది. ఇదొక్కటే కాదు నల్గొండ జిల్లాలో పదేళ్ల క్రితం 8 కాలేజీలుండగా.. ఇప్పుడు 3 మాత్రమే మిగిలాయి. భువనగిరి జిల్లాలో 7 కాలేజీలకుగాను, 3 మాత్రమే నడుస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఖ్య 15 నుంచి 4కి తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా గత ఐదేళ్లలో 335 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి. 2021లో ప్రభుత్వ, ప్రైవేటు మొత్తం డిగ్రీ కాలేజీల సంఖ్య 1,100 ఉండగా.. 2024లో 960కి, ఇప్పుడు 783 కాలేజీలకు తగ్గింది. ఏటా 50 దాకా ప్రైవేటు డిగ్రీకాలేజీలు మూతపడుతున్నాయి.
56 కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో డిగ్రీ సీట్లను దోస్త్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పటికే మూడు విడతల్లో దోస్త్ కౌన్సెలింగ్ ముగిసింది. సగం సీట్లు కూడా భర్తీ కాలేదు. నిబంధనల ప్రకారం ఏదైనా కాలేజీకి కేటాయించిన సీట్లలో వరుసగా మూడేళ్లపాటు 25శాతం నిండకుంటే.. సీట్లన్నీ రద్దుచేస్తుంది. ఈ ఏడాది 9 జిల్లాల్లోని 56 కాలేజీల్లో మొత్తం 16,460 సీట్లు ఉండగా, ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. ఇందులో చాలా కాలేజీల్లో గత రెండేళ్లలోనూ ప్రవేశాల సంఖ్య పాతికశాతం దాటలేదు. ఈ లెక్కన ఈ విద్యా సంవత్సరంలో 50కి పైగా కాలేజీలు మూతపడే అవకాశముంది. డిగ్రీ కోర్సులకు ఆదరణ తగ్గడంతో సీట్లు నిండని పరిస్థితి నెలకొంది. కాగా, గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థులు నేరుగా సంబంధిత కాలేజీకి వెళ్లి అడ్మిషన్లు పొందే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ ప్రోత్సాహం శూన్యం
రాష్ట్రంలో డిగ్రీ, పీజీ విద్యకు కీలకంగా నిలుస్తున్న ప్రైవేటు డిగ్రీ కాలేజీల మూసివేతకు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడమే కారణం. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర వృత్తివిద్య కోర్సులకు ఇస్తున్న ప్రాధాన్యత డిగ్రీ కాలేజీలకు ఇవ్వడం లేదు. ప్రైవేటు యునివర్సిటీలు, అటానమస్ కాలేజీలు, డీమ్డ్ యునివర్సిటీల్లోనూ డిగ్రీ కోర్సులకు ప్రభుత్వం పెద్దఎత్తున అనుమతిస్తుండటం కూడా కారణమే. డిగ్రీ కాలేజీలకు రూ.2 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ రావాల్సి ఉండగా.. ఇటీవలే నామమాత్రంగా విడుదల చేశారు. కాలేజీలను ఆర్థిక కష్టాలతో మూసివేయాల్సి వస్తోంది.
- సూర్యనారాయణరెడ్డి, ప్రైవేటు డిగ్రీ కాలేజీల
యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు
ఈ వార్తలు కూడా చదవండి..
‘సర్’పై కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి
‘సింగిల్ పర్మిట్’ అమలు చేయండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News