‘సింగిల్ పర్మిట్’ అమలు చేయండి
ABN , Publish Date - Sep 26 , 2026 | 05:40 AM
సరుకు రవాణా రంగానికి వెన్నెముకగా ఉన్న లారీ యజమానులకు పర్మిట్ల వ్యవహారం భారంగా మారుతోంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే లారీల విషయంలో రెండు ప్రభుత్వాలు ..
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు లారీ యజమానుల విన్నపం
ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధానం అమలు
ఏపీకి లారీ వెళ్లాలంటే వారానికి రూ.2 వేలు.. నెలకు రూ.5 వేలు
లారీ యజమానికి ఏడాదికి రూ.60 వేల ఆర్థిక భారం
ఖర్చులు పెరిగి యజమానులపై ఆర్థిక ఒత్తిడి
రెండు రాష్ట్రాల మధ్య ఒకే పర్మిట్ ఉండాలంటున్న ఆపరేటర్లు
హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): సరుకు రవాణా రంగానికి వెన్నెముకగా ఉన్న లారీ యజమానులకు పర్మిట్ల వ్యవహారం భారంగా మారుతోంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే లారీల విషయంలో రెండు ప్రభుత్వాలు అమలు చేస్తున్న పర్మిట్ విధానం యజమానులపై ఆర్థిక భారాన్ని పెంచుతోంది. సాధారణంగా మోటారు వాహనాల చట్టం ప్రకారం పక్క రాష్ట్రాలకు వెళ్లేందుకు సింగిల్ పర్మిట్ విధానంలో ఏడాదికి రూ.5 వేలు చెల్లిస్తే సరిపోతుంది. దీంతో సంవత్సర కాలంలో లారీ ఎన్ని ట్రిప్పులైనా ఆ రాష్ట్రంలోకి వెళ్లి రావచ్చు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు.
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు లారీ వెళ్లేందుకు వారం పర్మిట్‌కు, లేదా ఒక్కసారి వెళ్లిరావడానికి రూ.2 వేలు, నెలకైతే రూ.5 వేలు చెల్లించాల్సి వస్తోంది. నెలకు రూ.5 వేల చొప్పున లెక్కగట్టినా.. ఏడాది రూ.60 వేల దాకా చెల్లించాల్సి వస్తోందని లారీల యజమానులు వాపోతున్నారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఈ తరహా విధానం అమల్లో లేదని అంటున్నారు. నేషనల్ పర్మిట్‌కే ఏడాదికి రూ.17 వేలు చెల్లిస్తామని, అలాంటిది పక్క రాష్ట్రం వెళ్లేందుకు రూ.60 వేలు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వాహనాల నిర్వహణ కష్టంగా మారిందని, ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ నుంచి సరుకు రవాణాకు లారీలను పంపించడం కష్టమవుతోందని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానం అమలు చేస్తే తమతోపాటు రవాణా రంగానికి ఊరట లభిస్తుందని అంటున్నారు.
సరుకు రవాణా ధరలపై ప్రభావం...
పెద్ద ట్రాన్స్‌పోర్ట్ సంస్థలతో పోలిస్తే.. ఒకటి, రెండు లారీలు ఉన్న చిన్న యజమానులపై పర్మిట్, పన్నులు, నిర్వహణ వ్యయాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. లారీ కొనేందుకు తీసుకున్న రుణాల వాయిదాలు, బీమా, ఫిట్‌నెస్, టైర్లు, మరమ్మతులు, డ్రైవర్-క్లీనర్ వేతనాలు వంటి ఖర్చులు నిరంతరం కొనసాగుతుండటంతో ట్రిప్పుల సంఖ్య తగ్గినా.. ఖర్చులు తగ్గవంటున్నారు. రవాణా వ్యయం పెరిగితే దాని ప్రభావం చివరకు సరుకు ధరలపై పడే అవకాశం ఉంది. తయారీ కేంద్రాల నుంచి మార్కెట్లకు సరుకులను తరలించే వ్యాపారులు రవాణా చార్జీలను ఉత్పత్తి లేదా సరుకు ధరలో కలపాల్సి వస్తుంది. అందుకే పర్మిట్, పన్నుల వ్యవస్థను సరళీకరించడం వల్ల లారీ యజమానులతోపాటు సరుకు రవాణాదారులు, వ్యాపారులు, వినియోగదారులకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని లారీ యజమానులు పేర్కొంటున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్యే ముందుగా..
దేశవ్యాప్తంగా నేషనల్ పర్మిట్ విధానం ఉన్నప్పటికీ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రత్యేకంగా సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని లారీ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య భారీ స్థాయిలో సరుకు రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఒకే పర్మిట్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాహనాలు తిరిగేలా విధానం రూపొందించాలని వారు కోరుతున్నారు. ఇదే డిమాండ్‌పై లారీ ఓనర్స్ అసోసియేషన్ పలుమార్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. తెలుగు రాష్ట్రాల రవాణా శాఖలు సమన్వయంతో వ్యవహరించి సింగిల్ పర్మిట్‌పై స్పష్టమైన విధానం రూపొందించాలని కోరుతోంది. సింగిల్ పర్మిట్ విధానంపై రవాణా శాఖ అధికారులు ప్రభుత్వానికి ఇటీవలే ప్రతిపాదనలు పంపించారు. లారీ యజమానులు ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే.. సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టిండర్‌లో టెండర్.. ఖాతాల్లో రూ.8.26 కోట్లు గాయబ్!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News