Share News

టిండర్‌లో టెండర్‌.. ఖాతాల్లో రూ.8.26 కోట్లు గాయబ్‌!

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:31 AM

డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. మాటలు కలవడం.. ఆపై నమ్మకం కుదరడం.. చివరకు జేబులు ఖాళీ అవ్వడం! హైదరాబాద్‌లో ఇటీవల వెలుగు చూసిన రెండు వేర్వేరు సైబర్‌ నేరాలు డేటింగ్‌ యాప్‌ల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో మరోసారి హెచ్చరిస్తున్నాయి.

టిండర్‌లో టెండర్‌..   ఖాతాల్లో రూ.8.26 కోట్లు గాయబ్‌!
Hyderabad Dating App Scam

  • డేటింగ్‌యా్‌పల ద్వారా ఇద్దరు హైదరాబాదీలకు టోకరా

  • పెట్టుబడుల పేరుతో ఓ ఉద్యోగికి రూ.3.35 కోట్లకు బురిడీ

  • ప్రైవేట్‌ వీడియోలతో లాయర్‌ను బెదిరించి

  • రూ.4.91 కోట్లు దోచుకున్న కేటుగాళ్లు

  • అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్‌ సెక్యూరిటీ అధికారులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. మాటలు కలవడం.. ఆపై నమ్మకం కుదరడం.. చివరకు జేబులు ఖాళీ అవ్వడం! హైదరాబాద్‌లో ఇటీవల వెలుగు చూసిన రెండు వేర్వేరు సైబర్‌ నేరాలు డేటింగ్‌ యాప్‌ల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో మరోసారి హెచ్చరిస్తున్నాయి. సైబర్‌ నేరగాళ్ల వలలో పడి ఇద్దరు బాధితులు ఏకంగా రూ.8.26 కోట్లు సమర్పించుకున్నారు. మల్లంపేటకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి (39) టిండర్‌లో జపాన్‌ మహిళగా ఒకరు పరిచయమయ్యారు. ఆపై సంభాషణలు వాట్సా్‌పకు మారాయి. మాటలతో బాధితుడిని వలలో వేసుకున్న సదరు మహిళ, భారీ లాభాలు వస్తాయంటూ పెట్టుబడుల వైపు మళ్లించింది. మొదట నకిలీ డాష్‌బోర్డులో లాభాలు వస్తున్నట్లు చూపించడంతో, బాధితుడు మరింత డబ్బు పెట్టాడు. ఇలా 55 రోజుల వ్యవధిలో విడతలవారీగా రూ.3.35 కోట్లు బదిలీ చేశాడు.


ఆ తర్వాత డబ్బు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించగా, ‘‘క్రెడిట్‌ స్కోర్‌ తగ్గింది.. మరికొంత సొమ్ము చెల్లించాలి’’ అనడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మరో కేసులో హైదరాబాద్‌కు చెందిన యువ న్యాయవాదికి (27) టిండర్‌లో ‘దిశ’ అనే పేరుతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పరిచయమైంది. కొద్దిరోజులకే వీరి సంభాషణలు వ్యక్తిగత విషయాల వరకు వెళ్లాయి. తొలుత కుటుంబ అవసరాల పేరుతో డబ్బులు వసూలు చేసిన సదరు ఉద్యోగిని, ఆ తర్వాత బాధితుడి వ్యక్తిగత చాటింగ్‌లు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని, కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరింపులకు దిగింది.


తాను ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి చెందిన వ్యక్తినని బెదిరిస్తూ మానసికంగా కుంగదీసింది. భయపడిన సదరు న్యాయవాది రూ.3 వేలతో ప్రారంభించి, 241 లావాదేవీల ద్వారా ఏడాది వ్యవధిలో ఏకంగా రూ.4.91 కోట్లు చెల్లించాడు. దీనికోసం కుటుంబ పొదుపు మొత్తంతో పాటు ఆస్తులను సైతం విక్రయించాడు. అంతేకాక, కొన్నిసార్లు నేరుగా మనుషులను పంపి నగదు రూపంలో కూడా వసూలు చేసినట్లు బాధిత న్యాయవాది వాపోయాడు. వేధింపులు తాళలేక చివరకు కుటుంబ సభ్యులకు విషయం చెప్పి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యుత్‌ రంగంలో సంస్కరణలు

ముగిసిన ‘నైరుతి’ వర్షాలు!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 05:31 AM