Share News

ముగిసిన ‘నైరుతి’ వర్షాలు!

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:25 AM

నైరుతి రుతుపవన వర్షాలు ముగిశాయి.. రాష్ట్రానికి ప్రధాన ఆయువుపట్టుగా పిలిచే రుతుపవన వర్షాలు ఈ ఏడాది నిరాశే మిగిల్చాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ నిపుణులు ముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ముగిసిన ‘నైరుతి’ వర్షాలు!
Telangana Monsoon 2026

  • ఈ సీజన్‌లో 15 శాతం లోటు వర్షపాతం..

  • ఈ నెలలో 34 నుంచి 4 శాతానికి తగ్గిన లోటు

  • 4 రోజుల్లో సగటు 52 మి.మీ నమోదు

  • నేటి నుంచి మళ్లీ ఉక్కపోత మొదలు..

  • భద్రాద్రిలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • భూపాలపల్లి జిల్లాలో బొగ్గు ఉత్పత్తికి

  • అంతరాయం.. ఒక్కరోజే 18 కోట్ల నష్టం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): నైరుతి రుతుపవన వర్షాలు ముగిశాయి.. రాష్ట్రానికి ప్రధాన ఆయువుపట్టుగా పిలిచే రుతుపవన వర్షాలు ఈ ఏడాది నిరాశే మిగిల్చాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ నిపుణులు ముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా గత నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ఈ సీజన్‌ లోటు వర్షపాతం 20 నుంచి 15 శాతానికి తగ్గింది. ఈ నెలలో 22వ తేదీ వరకు 34 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అంటే 1 నుంచి ఆ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా కేవలం 86.5 మిల్లీమీటర్ల వర్షపాతమే కురిసింది. వాస్తవానికి ఆ 22 రోజుల పాటు 130 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంది. కాగా జూన్‌ 1 నుంచి ఆ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 704 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా.. కేవలం 560 మిల్లీమీటర్లే పడింది.


అయితే గత 4 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ నెల లోటు వర్షపాతం 4 శాతానికి తగ్గింది. అంటే కేవలం 4 రోజుల వ్యవధిలోనే ఏకంగా 30 శాతం లోటు వర్షపాతం కవరైంది. ఏకంగా 52 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం రాష్ట్రవ్యాప్తంగా నమోదైంది. ఇక ఈ నెల సగటు వర్షపాతం 145 మిల్లీమీటర్లకు గాను 139 మిల్లీమీటర్లుగా నమోదైంది. జూన్‌ నుంచి శుక్రవారం వరకు సగటు వర్షపాతం 718 మిల్లీమీటర్లకు గాను ఇప్పటివరకు 612 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అంటే 15 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ గణాంకాలు చెబుతున్నాయి.


మొన్నటి దాకా 18 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా.. అది ఇప్పుడు 14 జిల్లాలకు తగ్గింది. అయితే ఏ జిల్లాలోనూ అధిక, అత్యధిక వర్షపాతం నమోదు కాకపోవడం గమనార్హం. ఇక శనివారం నుంచి ఉక్కపోతతో కూడిన పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అలాగే తీవ్ర వాయుగుండం ప్రభా వం ముగిసిందని, ఈనెల 27 నుంచి అక్టోబరు 2 వరకు రాష్ట్రమంతా వేడి వాతావరణం ఉండే అవకాశముందంటున్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఖమ్మం జిల్లా వేంసూరులో 10.5 సెంటీమీటర్లు, సత్తుపల్లిలో 9.9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో 9.5, ఖమ్మం జిల్లా కల్లూరులో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.


భద్రాచలంలో పెరుగుతున్న ప్రవాహం

ఇటీవలి భారీ వర్షాలకు ఎగువన ఇంద్రావతి నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 20.2 అడుగులకు చేరుకుంది. శనివారం 30 అడుగులకు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇటు ఛత్తీ్‌సగఢ్‌, ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 65 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బొగ్గు గనులను వరద నీరు ముంచెత్తడంతో బొగ్గు ఉత్పత్తికి భారీ విఘాతం కలిగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యుత్‌ రంగంలో సంస్కరణలు

నా లక్ష్యం.. రాహుల్‌ను ప్రధానిగా చూడడమే

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 05:25 AM