Share News

విద్యుత్‌ రంగంలో సంస్కరణలు

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:11 AM

విద్యుత్‌ రంగంలో మరోమారు సంస్కరణలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ ట్రాన్స్‌కోలో పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టాలని తెలంగాణ పవర్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ (టీపీసీసీ) నిర్ణయించింది.

విద్యుత్‌ రంగంలో సంస్కరణలు
Telangana Power Sector Reforms

  • విద్యుత్‌ సంస్థల్లో వాటాల విక్రయానికి సన్నద్ధం

  • పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం

  • తొలుత ట్రాన్స్‌కోలో 26 శాతం వాటా విక్రయం

  • ఆ తర్వాత జెన్‌కో, సింగరేణి, డిస్కమ్‌ల వంతు

  • ప్రొఫెసర్‌ అర్వింద్‌ సుబ్రమణియన్‌ నేతృత్వంలో విద్యుత్‌ సంస్కరణల కమిటీ ఏర్పాటు

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ రంగంలో మరోమారు సంస్కరణలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ ట్రాన్స్‌కోలో పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టాలని తెలంగాణ పవర్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ (టీపీసీసీ) నిర్ణయించింది. ఇందుకోసం పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లాలనే యోచనలో ఉంది. ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్‌ను కన్సల్టెన్సీగా పెట్టుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ట్రాన్స్‌కోలో వంద శాతం వాటాదారుగా తెలంగాణ ప్రభుత్వమే ఉండగా.. ఇందులో 26 శాతం వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీ ముఖ విలువ రూ.68 వేల కోట్లుగా ఉంది.


సెక్యూరిటీ ఎక్స్చేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) నిబంధనల ప్రకారం 75 శాతం వాటా ప్రభుత్వం వద్ద ఉంటేనే పబ్లిక్‌ ఇష్యూకు అవకాశం ఉంటుంది. దీనికోసం ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీవో)కు వెళతారు. తొలుత డ్రాఫ్ట్‌ రెడ్‌ హెరింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ)ను సిద్ధం చేసి, కంపెనీ తన వివరాలు, ఆర్థిక పరిస్థితి, డబ్బు ఎందుకు అవసరం వంటి వివరాలతో కూడిన పత్రాన్ని సెబీకి సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మర్చంట్‌ బ్యాంకర్‌ నియామకం ఏర్పాటు చేసుకుంటారు. డీఆర్‌హెచ్‌పీ ఆమోదం తర్వాత ఐపీవోకు వెళతారు. ఐపీవో తర్వాత మార్కెట్‌లో కంపెనీ లిస్ట్‌ అవుతుంది.


షేర్ల అమ్మకం జరుగుతుంది. ఆ షేర్లను ప్రజలకు అమ్మడం ద్వారా వచ్చే నిధులు ట్రాన్స్‌కో చేతికి వెళతాయి. మలి విడతలో సెకండరీ మార్కెట్‌లో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ)/బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌(బీఎ్‌సఈ)లో లిస్టింగ్‌ అవుతుంది. ఆ తర్వాత కంపెనీ పనితీరు ఆధారంగా షేర్‌ విలువ పెరగడం/తగ్గడం వంటి ప్రక్రియలు చోటుచేసుకుంటాయి. ఈ ప్రక్రియలో ట్రాన్స్‌కోకు ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం షేర్లు కొనుగోలు చేసిన మదుపర్లదే బాధ్యత. తొలిదశలో ట్రాన్స్‌కోలో పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టి, మలి దశలో తెలంగాణ జెన్‌కో, ఆ తర్వాత దక్షిణ డిస్కమ్‌ (టీజీఎస్పీడీసీఎల్‌), ఉత్తర డిస్కమ్‌ (టీజీఎన్పీడీసీఎల్‌)తోపాటు సింగరేణిలో వాటాలనూ విక్రయించే యోచనలో ప్రభుత్వం ఉంది.


దీనికోసం విద్యుత్‌ సంస్కరణల కమిటీని నియమించాలని నిర్ణయించింది. దీనికి ప్రొఫెసర్‌ అరవింద్‌ సుబ్రమణియన్‌ అధ్యక్షత వహించనున్నారు. ఈ కమిటీకి సంబంఽధించిన ఫైలు ప్రభుత్వానికి చేరింది. ఆయన 2014 అక్టోబరు 16 నుంచి 2018 జూన్‌ 20 దాకా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. ప్రస్తుతం వాట్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు బ్రౌన్‌ యూనివర్సిటీకి సేవలందిస్తున్నారు. పలు దఫాలుగా ప్రభుత్వం ఆయనతో సంప్రదింపులు జరిపింది. విద్యుత్‌ సంస్కరణల కమిటీకి ఆయననే చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నాయి.


నష్టాల్లో డిస్కమ్‌లు..

రాష్ట్రంలోని విద్యుత్‌ పంపిణీ సంస్థల పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రూ.57,336 కోట్లు విద్యుత్‌ సంస్థలకు రావాల్సి ఉంది. ఈ బకాయిలే డిస్కమ్‌లకు శాపంగా మారాయి. కరెంట్‌ కొనుగోలుకు సంబంధించి సింగరే ణి, జెన్‌కోలకు డిస్కమ్‌లు చెల్లింపులు చేయలేని పరిస్థితి నెలకొంది. డిస్కమ్‌లు చెల్లింపులు చేయని కారణంగా జెన్‌కో.. బొగ్గు కొనుగోలుకు సంబంధించి సింగరేణికి భారీగా బకాయి పడింది. డిస్కమ్‌ల అప్పులు రూ.62 వేల కోట్లుగా ఉన్నాయి. తెలంగాణ ట్రాన్స్‌కో రూ.6,619 కోట్లు, తెలంగాణ జెన్‌కో రూ.32 వేల కోట్ల అప్పుల్లో ఉంది.


ఇవన్నీ భారీ వడ్డీ రేటుతో తెచ్చుకున్నవే. వార్షిక వడ్డీ 8 శాతం నుంచి 10.15 శాతానికి తెచ్చుకున్న అప్పులే. ప్రభుత్వం డిస్కమ్‌లకు ఇస్తే.. డిస్కమ్‌లు అప్పులు కట్టుకోవడంతో పాటు జెన్‌కో, సింగరేణికి చెల్లింపులు చేస్తాయి. అయితే డిస్కమ్‌లను గత ప్రభుత్వం కష్టాల్లోకి నెట్టగా.. ఈ ప్రభుత్వంలో ఆ అప్పులు శిఖర స్థాయికి చేరాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ట్రాన్స్‌కో, జెన్‌కో మాత్రమే పెట్టుబడుల ఉపసంహరణకు అనుకూలతలు కలిగి ఉన్నాయి. డిస్కమ్‌లకు బకాయిలన్నీ ప్రభుత్వం చెల్లించి, వాటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిస్తే తప్ప.. పెట్టుబడుల ఉపసంహరణ వీలు కాదు. ఈ ప్రక్రియ వల్ల భారీగా నిధులు రావడంతో పాటు విద్యుత్‌ సంస్థల పరిపాలనలో జవాబుదారీతనం మెరుగుపడనుంది. ఆ తర్వాత ప్రభుత్వ జోక్యం కూడా గణనీయంగా తగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి.


ఓపెన్‌ యాక్సె్‌స్‌పై రూ.0.83 అదనపు సర్‌చార్జీ!

2026-27 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ వార్షికం (అక్టోబరు నుంచి మార్చి దాకా)లో ఓపెన్‌ యాక్సెస్‌ వినియోగదారుల నుంచి అదనపు సర్‌చార్జిగా యూనిట్‌కు రూ.0.83 చొప్పున వసూలు చేయాలని తెలంగాణ డిస్కమ్‌లు నిర్ణయించాయి. ఈ మేరకు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ)లో పిటిషన్లు దాఖలు చేశాయి. ప్రతి ఆరు నెలలకోసారి అదనపు సర్‌చార్జి కోసం పిటిషన్లు వేసి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో రెండో అర్ధవార్షికంలో 83 పైసలు వసూలు చేసుకోవడానికి అనుమతించాలని కోరగా.. దీనిపై అక్టోబరు 16 లోగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలని ఈఆర్‌సీ కోరింది. అనంతరం అక్టోబరు 27న ఉదయం 11 గంటల నుంచి దీనిపై బహిరంగ విచారణ జరుగనుంది. ఆ తర్వాతే ఉత్తర్వులు విడుదల చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్రంలో కొత్తగా 200 కోర్టులు

నా లక్ష్యం.. రాహుల్‌ను ప్రధానిగా చూడడమే

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 05:11 AM