Share News

నేతలపై 284 క్రిమినల్‌ కేసులు

ABN , Publish Date - Nov 20 , 2026 | 01:12 AM

గత ఏడాది మార్చి నెలాఖరు వరకూ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులపై మొత్తం 284 క్రిమినల్‌ కేసులు వివిధ దశల్లో కోర్టుల్లో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

నేతలపై 284 క్రిమినల్‌ కేసులు
Telangana High Court

  • ఇవన్నీ గతేడాది మార్చి నెలాఖరు వరకు నమోదైనవే

  • రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో విచారణలో.. హైకోర్టుకు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వం

  • ఏపీ మాజీ సీఎం జగన్‌పై కేసుల విచారణను వేగవంతం చేయాలన్న పిటిషన్లపై ధర్మాసనం విచారణ

  • వాదనలు వినిపించిన వివిధ పక్షాల న్యాయవాదులు

  • ఈ నెల 30వ తేదీకి వాయిదా..

  • నేతలపై కేసుల మీద తాజా నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది మార్చి నెలాఖరు వరకూ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులపై మొత్తం 284 క్రిమినల్‌ కేసులు వివిధ దశల్లో కోర్టుల్లో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వీరిలో ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు వెల్లడించింది. ఏపీ మాజీ సీఎం జగన్‌పై ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణను వేగవంతం చేయాలని పేర్కొంటూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణపై పర్యవేక్షణ చేపట్టడానికి హైకోర్టు సుమోటోగా ఒక వ్యాజ్యాన్ని నమోదు చేసి విచారిస్తోంది.


జగన్‌పై పెండింగ్‌లో ఉన్న ఈడీ కేసుల మీద వేగంగా విచారణ చేపట్టేలా సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్లు గురువారం జస్టిస్‌ కే లక్ష్మణ్‌, జస్టిస్‌ అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా, పలువురు ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసులు ఉండగా జగన్‌ మీద నమోదైన కేసులే ప్రజా ప్రయోజనం కిందికి ఎలా వస్తాయని హరిరామజోగయ్య తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి న్యాయవాది పీ రాధాకృష్ణ సమాధానమిస్తూ.. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ఈడీ చార్జిషీట్లు దాఖలు చేసిందని, కేసుల విచారణ ముందుకు వెళ్లకుండా జగన్‌ అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. అధికారంలో ఉన్న నిందితుల మీద కేసుల విచారణ జరగదన్న తప్పుడు సందేశం వెళ్లకుండా ఉండటానికే పిల్‌ దాఖలు చేశామన్నారు. జగన్‌పై ఉన్న ఈడీ కేసుల్లో విచారణ వేగంగా జరిగేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు.


సీబీఐ కోర్టుపై ఇప్పటికే కేసుల భారం!

జగన్‌ తరఫున హాజరైన న్యాయవాది వాదిస్తూ.. చాలా మందిపై ఈడీ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, పిటిషనర్‌ కేవలం జగన్‌ కేసులపైనే దృష్టిపెట్టారని.. ఇది నిజమైన పిల్‌ కాదన్నారు. ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జగన్‌పై ఉన్న సీబీఐ కేసులపై మాత్రమే రోజువారీ విచారణ జరుగుతోందని.. ఈడీ కేసుల్లో కూడా రోజువారీ విచారణకు ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ఈడీని ఉద్దేశించి.. ‘మీరు సీబీఐ కోర్టును కూడా ప్రతివాదిగా చేర్చారు. పాపం! సీబీఐ కోర్టు న్యాయాధికారి మాత్రం ఏం చేస్తారు? ఆ కోర్టుపై ఇప్పటికే అధిక భారం పడుతోంది. ఒక్కో డిశ్చార్జి పిటిషన్‌లో ఐదురోజులపాటు వాదనలు వినిపిస్తున్నారు. న్యాయాధికారి మాత్రం ఏంచేయగలరు?’ అని వ్యాఖ్యానించింది. ఈడీ పిటిషన్‌ను సైతం ఇతర పిటిషన్లతో కలిపి విచారిస్తామన్న ధర్మాసనం.. విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్‌ కేసులపై తాజా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.


ఎమ్మెల్సీల కేసులపై సుప్రీంకోర్టుకే వెళ్లండి

ఎమ్మెల్సీలకు సంబంధించిన కేసులను కూడా ప్రజాప్రతినిధుల కేసుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణను వేగవంతం చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాము పర్యవేక్షణ జరుపుతున్నామని, ఎమ్మెల్సీలు కూడా అని సుప్రీంకోర్టు పేర్కొనలేదు కాబట్టి.. ఈ విషయంపై సుప్రీంకోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి...

సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్

హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం

Read latest Telangana News And Telugu NEws

Updated Date - Nov 20 , 2026 | 01:15 AM