దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనకు 13 ఏళ్లు
ABN , Publish Date - Feb 21 , 2026 | 01:24 PM
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన రెండు బాంబు పేలుళ్ల ఘటనకు 13 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందగా, 130 మంది తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 21: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల (Dilsukhnagar Bomb Blast) ఘటనకు నేటితో 13 ఏళ్ళు పూర్తి అయ్యాయి. 2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 6:50 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్ థియేటర్ వద్ద రెండు బాంబులు వరుసగా పేలాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలు అయ్యాయి. బాంబు పేలుళ్లతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. చాలా మంది శరీర భాగాలను కోల్పోయి ఇప్పటికీ అంగవైకల్యంతో బాధపడుతున్నారు.
ఇండియన్ ముజాహిద్దీన్ అనే సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడింది. బాబ్రీ మజీద్ కూల్చివేతకు ప్రతీకారంగా ఇండియన్ ముజాహిద్దీన్ ఈ బాంబు పేలుళ్లకు తెగబడింది. ఈ పేలుళ్లలో ప్రధాన నిందితుడు ఇండియన్ ముజాహిద్దీన్ కీలకనేత యాసిన్ భత్కల్. మరో ఐదు మందితో కలిసి యాసిన్ భత్కల్ ఈ పేలుళ్లకు పాల్పడ్డాడు. అబ్ధుల్లాపూర్‌మెట్‌లోని ఓ ఇంట్లో ఉండి బాంబు పేలుళ్లకు కుట్రపన్నారు. రెండు పాతసైకిళ్లు, రెండు కుక్కర్లను కొనుగోలు చేసిన ఉగ్రవాదులు.. రెండు అత్యంత శక్తివంతమైన ఐఈడీ బాంబులను మార్చారు. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పేలుళ్లకు భత్కల్ ప్లాన్ చేయగా.. అందుకు అనుగుణంగానే ఫిబ్రవరి 21, 2013న దిల్‌సుఖ్‌నగర్‌లో రెండు సైకిళ్లను పార్క్ చేయడంతో కొద్దిసేపటికే రెండు బాంబులు పేలాయి. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది శరీర భాగాలు కోల్పోయి అంగవైకల్యాన్ని అనుభవిస్తున్నారు.
పేలుళ్లపై ఎన్‌ఏఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి.. ఇండియన్ ముజాహిద్దీన్ పేలుళ్లకు పాల్పడినట్లు గుర్తించింది. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసింది. ఎన్‌ఐఏ కోర్టులో ప్రత్యేక విచారణ జరుగగా.. 2016లో ఈ ఉగ్రవాదులందరికీ ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో నిందితులంతా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ.. నిందితులకు ఉరిశిక్ష విధించింది. అయితే నేటితో బాంబు పేలుళ్లకు 13 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాంబు పేలుడు జరిగిన కోణార్క్ థియేటర్ వద్ద పోలీసులు భద్రతను పెంచారు. దిల్‌సుఖ్‌నగర్‌తో పాటు మరికొన్ని రద్దీ ప్రాంతాల్లోనూ అలర్ట్ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
షబ్బీర్ అలీ, రమణారెడ్డి మధ్య సవాళ్లు.. కామారెడ్డిలో ఉద్రిక్తత
మొబైల్ షాప్‌లో చెలరేగిన మంటలు.. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది
Read Latest Telangana News And Telugu News