హైదరాబాద్ చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్లాన్..
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:31 PM
చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 21: దేశవ్యాప్తంగా ఉగ్రముప్పు అంటూ నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశరాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ములాఖత్‌కు వచ్చిన వ్యక్తులతో ఉగ్రదాడులపై సంభాషణలు చేసినట్లు సమాచారం. జైలు నుంచే ప్రణాళికలు సాగినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది కుట్ర చేసినట్లు సమాచారం. నిఘావర్గాల హెచ్చరికతో ముసారంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్ ప్రాంతాలపై పోలీసులు నిఘాపెట్టారు. ప్రముఖ దేవాలయాలను టార్గెట్‌గా చేసుకుని పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు.
మరోవైపు దేశరాజధాని ఢిల్లీలోనూ హైఅలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట, చాందినీ చౌక్ ఆలయం వద్ద ఐఈడీ పేలుళ్లకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచించారనే సమాచారం మేరకు ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో కొన్ని దేవాలయాలు, వీఐపీ జోన్లు అన్నింటిపైనా నిఘా ఉంచారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల సమీపంలో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పలు హెచ్చరికలు వచ్చాయి. దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలు కేంద్రంగా ఉగ్రకుట్ర ప్లాన్ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో హైదరాబాద్ పేలుళ్ల కేసులో కీలక నిందితుడితోపాటు కరుడుగట్టిన ఉగ్రవాదులు జైల్లో ఉన్న నేపథ్యంలో ములాఖత్‌కు వచ్చిన వ్యక్తులు ఎవరు అనే దానిపై తెలంగాణ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘావర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
షబ్బీర్ అలీ, రమణారెడ్డి మధ్య సవాళ్లు.. కామారెడ్డిలో ఉద్రిక్తత
మొబైల్ షాప్‌లో చెలరేగిన మంటలు.. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది
Read Latest Telangana News And Telugu News