Share News

డ్రగ్స్‌పై ఈగల్ టీం ఉక్కుపాదం.. గంజాయి సాగును నిర్మూలించాం: ఐజీ రవికృష్ణ

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:12 PM

ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. అల్లూరి సీతారామరాజు నడిచిన పవిత్ర భూమిలో గంజాయి సాగు ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

డ్రగ్స్‌పై ఈగల్ టీం ఉక్కుపాదం.. గంజాయి సాగును నిర్మూలించాం: ఐజీ రవికృష్ణ
Eagle IG Ravikrishna

విజయవాడ, ఫిబ్రవరి 21: డ్రగ్స్‌పై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతోందని ఈగల్ ఐజీ రవికృష్ణ (EAGLE IG Ravikrishna) తెలిపారు. శనివారం ఈగల్ టీం వార్షిక నివేదికను వెల్లడించారు ఐజీ. 2024 సెప్టెంబర్‌లో తమిళనాడులో జరిగిన మీటింగ్‌లో ఏపీ గంజాయి సాగుకు కేంద్రంగా ఉందని చర్చించగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు ఉండకూడదని అప్పుడే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఆపరేషన్ చైతన్యం పేరుతో ప్రజల్లో అవగాహన తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని చెప్పారు. అల్లూరి నడిచిన పవిత్ర భూమిలో గంజాయి సాగు ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.


ఇప్పుడు దేశస్థాయిలో ఏపీకి మంచి పేరు వచ్చిందని ఐజీ రవికృష్ణ చెప్పారు. గంజాయిని ఎలా కంట్రోల్ చేశారని మీటింగ్‌లలో అడుగుతున్నారని పేర్కొన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. ట్రైన్స్‌లో గంజాయి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. పొగాకు రహిత విద్యాసంస్థల కార్యక్రమం, డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాలు విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అన్నారు. మీ ప్రాంతాల్లో గంజాయి సరఫరా ఉంటే 1972కి కాల్ చేయాలని ప్రజలను ఐజీ కోరారు. గతంలో డ్రగ్స్‌లో పట్టుబడిన వారు పద్ధతి మార్చుకుంటే సురక్షితంగా ఉంటారని, కానీ మారకపోతే నిఘా ఉంటుందని ఐజీ రవికృష్ణ హెచ్చరించారు. ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదైతే విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుందని, ప్రతి కేసును ఛాలెంజ్‌గా తీసుకుంటున్నామని తెలిపారు. దేశం పట్ల గౌరవం ఉన్నవారు డ్రగ్స్ జోలికి వెళ్లకూడదని ఆయన సూచించారు.


తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తున్నామని.. విద్యార్థులు, యువతకు అవగాహన కల్పిస్తున్నామని ఐజీ రవికృష్ణ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 13000 కాల్స్ వచ్చాయని వెల్లడించారు. ప్రభుత్వం ఈగల్ టీమ్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తోందన్నారు. రాష్ట్రంలో జీరో డ్రగ్స్, గంజాయి తమ ధ్యేయమని ఐజీ రవికృష్ణ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నెట్‌వర్క్‌ను బ్రేక్ చేశామని, ఒడిశా నుంచి గంజాయి సరఫరా అవుతోందని తెలిపారు. ఇప్పటి వరకు పొగాకు నియంత్రణలో భాగంగా 45,200 దుకాణాలను తనిఖీ చేసి, 47,441 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 72,92,000 రూపాయల జరిమానా విధించామని వివరించారు.


డ్రగ్స్ నియంత్రణలో 96 నిరోధాత్మక నిర్బంధాలు అమలు చేసి, ఆర్థిక దర్యాప్తుల ద్వారా 9 కోట్ల 11 లక్షల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. విద్యా సంస్థల్లో 40 వేలకు పైగా ఈగల్ క్లబ్బులు ఏర్పాటు చేశామన్నారు. 35 వేలకు పైగా అవగాహన కార్యక్రమాల ద్వారా 20 లక్షల విద్యార్థులను చైతన్యపరిచామని చెప్పారు. 1,12,400 కిలోల గంజాయిని శాస్త్రీయ విధానంలో దహనం చేశామన్నారు. 1836 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు చేసి, 46,011 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 4760 మంది నిందితులను అరెస్ట్ చేసి, 770 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఐజీ రవికృష్ణ వివరించారు.


ఇవి కూడా చదవండి...

27 నుంచి ఇస్రో ‘యువికా’ రిజిస్ర్టేషన్లు

వైసీపీ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే: భానుప్రకాశ్ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 21 , 2026 | 12:52 PM