Share News

వైసీపీ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే: భానుప్రకాశ్ రెడ్డి

ABN , Publish Date - Feb 21 , 2026 | 10:46 AM

ఏపీ శాసనమండలిలో వైసీపీ నేతలు చెప్పులు, బూట్లు వేసుకుని వేంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకోవడంపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై న్యాయ నిపుణులతో మాట్లాడానని, స్వామివారి పట్ల అపచారం చేసిన వారికి లీగల్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.

వైసీపీ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే: భానుప్రకాశ్ రెడ్డి
Bhanu Prakash Reddy

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: శాసనమండలిలో వైసీపీ నేతలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పట్ల చూపిన వ్యవహారాన్ని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది దైవద్రోహం..అపచారం’ అని మండిపడ్డారు. శాసనమండలిలో వైసీపీ నేతలు చెప్పులు, బూట్లు వేసుకుని వేంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. జగన్‌మోహన్ రెడ్డి కళ్లల్లో ఆనందం చూడాలని, ఆయనను సంతృప్తి పరిచేందుకు నేతలు వ్యవహరించిన తీరు దురదృష్టకరమని మండిపడ్డారు. ‘మీరు వేంకటేశ్వర స్వామి భక్తులా? యేసు భక్తులా?’ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్వామి భక్తులైతే ఈ విధంగా ప్రవర్తించరని ఆయన అన్నారు.


వైసీపీ నేతలకు బుద్ధి లేదని భానుప్రకాశ్ రెడ్డి విమర్శించారు. 2019 నుంచి 2024 వరకు టీటీడీని టార్గెట్ చేసి దాడులు చేశారని గుర్తు చేశారు. వైసీపీ నేతలు చెప్పులు వేసుకొని వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకువెళ్లిన సంఘటనపై న్యాయ నిపుణులతో మాట్లాడానని, స్వామివారి పట్ల అపచారం చేసిన వారికి లీగల్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. హిందువులను గౌరవించే వ్యక్తి అయితే జగన్‌ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచే దీనికి డైరెక్షన్ జరిగిందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని, దేవాలయాలను అవహేళన చేసే విధంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.


శాసనమండలి పెద్దల సభను వైసీపీ నేతలు ‘రాక్షస సభ’గా మార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంపై విష ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిన్నటి సంఘటనపై జగన్‌మోహన్ రెడ్డి సహా అందరూ క్షమాపణ చెప్పాలని, అలిపిరికి వచ్చి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన ఏడుకొండలపై కొలువైన స్వామితో ఆటలాడుకోవడం మంచిది కాదని... గతంలో విమర్శించిన వారు మాడి మసైపోయారని హెచ్చరించారు. వేంకటేశ్వర స్వామి ఆగ్రహం వల్లే వైసీపీ 11 స్థానాలకు పరిమితమయ్యారని భానుప్రకాశ్ వ్యాఖ్యలు చేశారు.


అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ అని.. వారిలో మొదటి స్థానంలో భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారని భాను ప్రకాశ్ ఎద్దేవా చేశారు. కరుణాకర్ రెడ్డి సిట్ విషయంలో మాట్లాడిన దానిలో వాస్తవం లేదని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి నెయ్యి కొనుగోలులో మార్పులు చేసినప్పుడు భూమన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలు హిందూ ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాన్ తిరగే పరిస్థితి లేదన్నారు. ఎన్‌డీఏ కూటమిని అడ్డుకోలేకనే టీటీడీని అడ్డుపెట్టుకుని డ్రామాలు చేస్తున్నారని భాను ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.


ఇవి కూడా చదవండి...

వైసీపీ మహాపచారం

27 నుంచి ఇస్రో ‘యువికా’ రిజిస్ర్టేషన్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 21 , 2026 | 12:44 PM