గణేశ్ ఉత్సవాలు.. అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Sep 07 , 2026 | 09:33 PM
గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. మండపాల ఏర్పాటు నుంచి గణేశ్ నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. మండపాల ఏర్పాటు నుంచి గణేశ్ నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెప్టెంబరు 14 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. 25న నిమజ్జనం నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులతో సీవీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపాల వివరాలను సేకరించి పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీజీపీ తెలిపారు. మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, నిర్వాహకులు, కమిటీ సభ్యులు, నిమజ్జనానికి వినియోగించే వాహనాల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రత్యేక లాగిన్‌ల ద్వారా తమ పరిధిలోని మండపాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. సీపీలు, డీసీపీలు, ఎస్పీలు స్వయంగా మండపాలను సందర్శించి.. అక్కడి పరిస్థితులను పరిశీలించాలని, ఇందుకు సంబంధించిన వివరాలను పాయింట్ బుక్స్‌లో నమోదు చేయాలని డీజీపీ సూచించారు.
అగ్నిప్రమాదాలపై ప్రత్యేక దృష్టి
గణేశ్ మండపాల వద్ద విద్యుత్తు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీవీ ఆనంద్ ఆదేశించారు. విద్యుత్తు, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద నిర్వాహకులు స్వచ్ఛంద కార్యకర్తలను ఏర్పాటు చేసుకునేలా చూడాలని.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో క్యూల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున.. నిమజ్జన మార్గాలు, ప్రధాన రహదారులు, వంతెనలను ముందుగానే గుర్తించాలని డీజీపీ సూచించారు. ఆయా మార్గాల సామర్థ్యాన్ని పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించాలని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో బాంబ్ డిస్పోజల్ బృందాలు, డాగ్ స్క్వాడ్‌లను వినియోగించాలని డీజీపీ ఆదేశించారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపాలను జియో ట్యాగింగ్ చేసి.. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్ల వివరాలను నమోదు చేయాలని డీజీపీ తెలిపారు. జియో ట్యాగింగ్, తనిఖీలకు సంబంధించిన వివరాలను టీజీ-కాప్ ప్లాట్‌ఫాంలోనూ అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో మ్యాచ్‌లో ఓవరాక్షన్.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాక్
భారత్-జపాన్ స్పెషల్ టీ20 మ్యాచ్.. యూట్యూబ్‌లో ప్రసారం?