భారత్‌తో మ్యాచ్‌లో ఓవరాక్షన్.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాక్
ABN , Publish Date - Sep 07 , 2026 | 04:57 PM
పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాకిచ్చింది. మహిళల ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాతిమా ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెపై చర్యలు తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాకిచ్చింది. మహిళల ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాతిమా ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెపై చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ ఆమె ఖాతాలో జత చేసింది.
అసలేం జరిగిందంటే?
ఆసియా కప్‌లో భాగంగా గ్రూప్ ఏ మ్యాచ్‌లో భారత్-పాకిస్థాన్ తలపడ్డాయి. తొలుత టీమిండియా స్పిన్నర్ల ధాటికి పాక్ 55 పరుగులకే కుప్పకూలింది. ఛేదనలో భారత ఓపెనర్ షఫాలీ వర్మను ఫాతిమా సనా ఔట్ చేసింది. ఆ తర్వాత ‘బయటకు వెళ్లు’ అన్నట్లు పెవిలియన్ వైపు చూపిస్తూ చేతులతో సైగలు చేసింది. బ్యాటర్ ఔటైన సమయంలో ఆమెను రెచ్చగొట్టేలా లేదా అవమానించేలా హావభావాలు ప్రదర్శించకూడదన్న ఐసీసీ నిబంధనకు ఇది విరుద్ధమని మ్యాచ్ అధికారులు తేల్చారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.5 కింద ఫాతిమాపై అభియోగాలు నమోదయ్యాయి. ఆమె తన తప్పును అంగీకరించడంతో పాటు ఐసీసీ ప్రతిపాదించిన శిక్షను కూడా అంగీకరించింది. దీంతో ఈ వ్యవహారంపై అధికారిక విచారణ నిర్వహించాల్సిన అవసరం లేకపోయింది.
రెండోసారి తప్పిదం
గత ఏడాది నుంచి ఫాతిమా సనా డీమెరిట్ పాయింట్ పొందడం ఇది రెండోసారి. 2025 ఆగస్టు 6న డబ్లిన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆమెకు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. ఐసీసీ నిబంధనల ప్రకారం లెవల్-1 ఉల్లంఘనలకు అధికారిక హెచ్చరిక నుంచి ప్లేయర్ మ్యాచ్ ఫీజులో గరిష్ఠంగా 50 శాతం జరిమానా వరకు విధించే అవకాశం ఉంటుంది. దీనికి అదనంగా ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు కూడా ఇవ్వొచ్చు. ఒక ప్లేయర్ ఖాతాలో 24 నెలల వ్యవధిలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు చేరితే అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారతాయి. ఒక టెస్టు లేదా రెండు వన్డేలు/టీ20 మ్యాచ్‌ల్లో వేటు పడుతుంది.
ఇవి కూడా చదవండి:
భారత్‌పై సాధించిన ఆ విజయమే మా పతనానికి కారణం: పాక్ మాజీ కెప్టెన్
దులీప్ ట్రోఫీ ఫైనల్: విధ్వంసం.. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ