ఈసారి అలా జరగనివ్వం.. కోహ్లీ, రోహిత్‌కు న్యూజిలాండ్ కెప్టెన్ వార్నింగ్
ABN , Publish Date - Sep 07 , 2026 | 08:34 PM
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. న్యూజిలాండ్ గడ్డపై గతంలో ఈ ఇద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని గుర్తు చేస్తూ.. ఈసారి మాత్రం అలాంటి అవకాశాన్ని ఇవ్వబోమని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. న్యూజిలాండ్ గడ్డపై గతంలో ఈ ఇద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని గుర్తు చేస్తూ.. ఈసారి మాత్రం అలాంటి అవకాశాన్ని ఇవ్వబోమని తెలిపాడు. అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత్ న్యూజిలాండ్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ టూర్‌లో ఐదు వన్డేలు, ఐదు టీ20లతో పాటు రెండు టెస్టులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ రూపంలో ఎదురయ్యే సవాల్‌పై శాంట్నర్ స్పందించాడు.
‘ఇది మాకు సవాలే. వాళ్లు చాలా కాలంగా అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నారు. ముఖ్యంగా వన్డే క్రికెట్‌లో రోహిత్-కోహ్లీకి ఎంతో అనుభవం ఉంది. గతంలో న్యూజిలాండ్‌లోని కొన్ని పిచ్‌లపై వాళ్లు బాగా ఆడారు. కానీ ఈసారి అలా జరగకూడదని ఆశిస్తున్నాం. ప్రస్తుతం సొంతగడ్డపై భారత్‌తో సిరీస్ గెలవాలి. అది మాకు అద్భుతమైన విజయమే అవుతుంది. ఆ తర్వాత 2027 వన్డే ప్రపంచకప్ నాటికి జట్టు కూర్పు ఎలా ఉండాలన్నదానిపై దృష్టి పెడతాం’ అని శాంట్నర్ వెల్లడించాడు.
వారికి కష్టమే..
ప్రస్తుతం భారత టెస్టు జట్టు మార్పుల దశలో ఉందని శాంట్నర్ అభిప్రాయపడ్డాడు. ‘భారత జట్టులోని కొంతమంది ఆటగాళ్లకు న్యూజిలాండ్‌లో రెడ్‌బాల్ క్రికెట్ ఆడటం ఇదే తొలిసారి కావచ్చు. ఇక్కడి పిచ్‌లు వారికి కొత్తగా అనిపిస్తాయి. స్వదేశంతో పోలిస్తే ఇక్కడ బంతి కాస్త ఎక్కువగా కదులుతుంది. అయితే భారత బౌలింగ్ దళాన్ని తక్కువగా అంచనా వేయలేం. బుమ్రా తిరిగి బౌలింగ్ దళంలోకి వస్తే వారి బలం మరింత పెరుగుతుంది’ అని శాంట్నర్ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో ఆడటం తమకు ఎప్పుడూ ప్రత్యేకమేనని శాంట్నర్ చెప్పాడు. ‘భారత్ ఎప్పుడు వచ్చినా ఉత్సాహంగానే ఉంటుంది. రెండు టెస్టులు మాత్రమే ఉన్నా సరే.. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో తలపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. భారత్ ఆ స్థాయిలో ఉంది’’ అని శాంట్నర్ వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో మ్యాచ్‌లో ఓవరాక్షన్.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాక్
భారత్-జపాన్ స్పెషల్ టీ20 మ్యాచ్.. యూట్యూబ్‌లో ప్రసారం?