Share News

2027 వన్డే ప్రపంచ కప్: కీలక బాధ్యతలు.. ఇంగ్లండ్ జట్టులోకి కెవిన్ పీటర్సన్ రీఎంట్రీ

ABN , Publish Date - Sep 07 , 2026 | 07:09 PM

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మళ్లీ ఇంగ్లండ్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా పీటర్సన్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక బాధ్యతలు అప్పగించింది.

2027 వన్డే ప్రపంచ కప్: కీలక బాధ్యతలు.. ఇంగ్లండ్ జట్టులోకి కెవిన్ పీటర్సన్ రీఎంట్రీ
Kevin Pietersen

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ క్రికెట్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మళ్లీ ఇంగ్లండ్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా పీటర్సన్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక బాధ్యతలు అప్పగించింది. వైట్ బాల్ జట్లకు స్పెషలిస్ట్ మెంటార్‌గా నియమితుడయ్యాడు. దీంతో 2014లో ఇంగ్లండ్‌ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన పీటర్సన్‌.. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లండ్‌ జెర్సీలో కనిపించనున్నాడు. ఏడాది పాటు బ్రెండన్‌ మెకల్లమ్‌ కోచింగ్‌ బృందంతో కలిసి పనిచేయనున్నాడు.


గర్వంగా ఉంది: పీటర్సన్

‘దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్ 2027 ప్రయాణాల్లో ఇంగ్లండ్ జట్టులో రీఎంట్రీ ఇవ్వడం గర్వంగా ఉంది. 2014 తర్వాత మళ్లీ జెర్సీ ధరించడం ప్రత్యేకమైన గౌరవంగా అనిపిస్తోంది. ఇది నాకు భావోద్వేగ క్షణం. ఇంగ్లండ్ వైట్‌బాల్‌ జట్టులో అద్భుతమైన ప్రతిభ ఉంది. ఆటగాళ్ల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వెలికితీసేందుకు వారితో కలిసి కష్టపడి పనిచేయాలని ఎదురుచూస్తున్నా. వచ్చే 12 నెలలు బ్రెండన్‌ ఆలోచనా బృందంలో భాగం కావడం గొప్ప అవకాశం’ అని పీటర్సన్ వెల్లడించాడు.


బ్యాటర్లకు పీటర్సన్‌ అనుభవం కీలకం: మెకల్లమ్‌

పీటర్సన్‌ నియామకంపై ఇంగ్లండ్‌ ప్రధాన కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ కూడా హర్షం వ్యక్తం చేశాడు. ‘కేపీపై నాకు ఎంతో గౌరవం ఉంది. క్రికెట్‌లో అతడు సాధించిన విజయాలు అద్భుతం. ఇంగ్లండ్‌ క్రికెట్‌పై అతడు ఎంతో ప్రభావం చూపించాడు. అతడి అనుభవం, పరిజ్ఞానం మా జట్టుకు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా మా బ్యాటర్లకు అతడితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా ఉత్సాహంగా ఉంది. అత్యున్నత స్థాయిలో ఎలా రాణించాలో పీటర్సన్‌కు ప్రత్యేకమైన అవగాహన ఉంది. అది మా ఆటగాళ్లకు ఎంతో విలువైనది’ అని మెకల్లమ్‌ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో మ్యాచ్‌లో ఓవరాక్షన్.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాక్

భారత్-జపాన్ స్పెషల్ టీ20 మ్యాచ్.. యూట్యూబ్‌లో ప్రసారం?

Updated Date - Sep 07 , 2026 | 07:09 PM