kumaram bheem asifabad-రైతులపై ఎరువుల భారం
ABN , Publish Date - May 01 , 2026 | 10:22 PM
మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా రైతులపై ఎరువుల భారం పడుతోంది. ధరలు మరింత పెరగడంతో అన్నదాతలు దిక్కుదోచని స్థితిలో పడిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి ఒకే సారి పంట మద్దతు ధర పెంచుతున్నాయి. కానీ ఎరువుల కంపెనీలు మాత్రం ఏదో ఒక కారణం చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టానుసారంగా ఎరువుల ధరలు పెంచుతూ పోతున్నాయి. గడిచిన వానాకాలం నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు ధరలు పెంచాయి. తాజాగా పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమల్లోకి రానున్నాయి.
- ఒక్కో బస్తాపై రూ. 350 వరకు పెంపు
- బెంబేలెత్తుతున్న రైతులు
- జిల్లాలో 4.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు
చింతలమానేపల్లి, మే 1 (ఆంధ్రజ్యోతి): మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా రైతులపై ఎరువుల భారం పడుతోంది. ధరలు మరింత పెరగడంతో అన్నదాతలు దిక్కుదోచని స్థితిలో పడిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి ఒకే సారి పంట మద్దతు ధర పెంచుతున్నాయి. కానీ ఎరువుల కంపెనీలు మాత్రం ఏదో ఒక కారణం చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టానుసారంగా ఎరువుల ధరలు పెంచుతూ పోతున్నాయి. గడిచిన వానాకాలం నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు ధరలు పెంచాయి. తాజాగా పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలుచొరవ చూపి ధరలను కట్టడి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరకుల ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం ఎరువులపై పడినట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా సహజ వాయువు సరఫరా నిలిచి పోవడం, రవాణా చార్జీలు పెరిగి పోవడానికి తోడు డాలర్ రూపాయి విలువ దారుణంగా పడి పోవడం కూడా ఇందుకు కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా, ఉక్రేయిన్ యుద్ధం తర్వాత ప్రస్తుతం ఇజ్రాయిల్ యుద్ధంతో ఈ దుస్థితి తలెత్తినట్లు చెబుతున్నారు. మునుముందు ఎరువుల ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ధరల పెంపునకు తోడు కొరత ఏర్పడుతుందనే భావనతో కొందరు రైతులు రానున్న వర్షాకాలం సీజన్ కోసం పలు రకాల కాం ప్లెక్స్ డీఏపీ, పొటాష్ ఎరువులను నిల్వ చేసుకుం టున్నట్లు సమాచారం. ఇదే అదునుగా భావించిన ఎరువుల వ్యాపారులు పాత నిల్వలను కూడా కొత్త ధరలతో విక్రయించే అవకాశం ఉన్నది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
- లక్ష టన్నులపైనే వినియోగం..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో సమారుగా 4.6 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. వీటికి సుమారుగా లక్షపైనే టన్నుల వివిధ కాంప్లెక్స్ ఎరువులను వినియోగిస్తారు. అధిక దిగుబడి, నాణ్యత కోసం రైతులు కాంప్లెక్స్ డీఏపీ, పొటాషియం వంటి ఎరువులను ఉపయోగిస్తారు. ఇందుకు గానూ ఒక్కో సీజన్‌కు సుమారుగా యాబై వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వాడనున్నారు. ఈ లెక్కన పెరిగిన ధరలతో లక్షలాది రూపాయల బరువును మోయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని రైతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- పరిమితికి మంచి వినియోగం..
జిల్లాలో పరిమితికి ఎరువుల వినియోగం జరుగుతుంది. రైతులు వివిధ మార్గాల ద్వారా సాగు నీటి లభ్యత పెంచుకొని పంట విస్తీర్ణం కూడా పెంచుతుండంతో ఎరువుల వాడకం గతంలో కన్నా రెండింతల వాడకం పెరుగుతుంది. గరిష్ఠంగా ఎకరాకు 3 బస్తాల యూరియా, ఒఝటిన్నర బస్తాల డీఏపీ, బస్తా పొటాష్ వాడితే సరిపోతుందని అధికా రులు చెబుతున్నా మోతాదుకు మించి యూరియాతో పాటు ఇతర ఎరువులను వినియోగిస్తున్నారు. అధిక దిగుబడులు వస్తాయనే ఆశతో చల్లేస్తున్నారు. సీజన్లలో దొరకకపోవచ్చని సీజన్‌కు ముందే నిల్వలు పెట్టుకుంటు న్నారు. కాగా పెరిగిన ఎరువుల ధరలు ఈ నెల నుంచే అమల్లోకి వచ్చాయి. గడిచిన యాసంగితో పోల్చితే కాంప్లెక్స్ ఎరువులధర రూ. 300 పెరిగింది. అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాషియం ధర రూ. 125 పెరిగింది. గడిచిన వానాకాలంలో పోల్చితే ఎరువుల ధరలు రూ. 600 ల వరకు పెరిగింది. పొటాష్ ధర రూ. 275 పెరగడం గమనార్హం. డీఏపీ (డ్రై అమోనియా పాస్పేట్) సింగిల్ సూపర్ పాస్పేట్ ధరలు మాత్రం పెరుగలేదు. కాగా ప్రభుత్వం సబ్సి డీపై అందించే యూరియా మాత్రం మార్పు చేయ లేదు.
ఎరువుల ధరలు (రూపాయల్లో)
ఎరువు పాత ధర కొత్త ధర
20:20:0:13 1,500 1,800
10:26:26 2,025 2,250
12:32:16 2,025 2,250
14:35:14 2,175 2,400
19:19:19 2,075 2,300
ఎంఓపీ 1,800 1,975
రైతులపై భారం..
- బొట్టుపల్లి జైరాం, రైతు సంఘం నాయకుడు
ఎరువుల ధరలు విపరీతంగా పెంచడంతో రైతు లపై భారం పడుతోంది. ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఎరువుల ధరల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలి. రైతులు పండించిన పంటలకు కూడా మద్దతు ధర పెంచాలి. ఎరువుల, విత్తనాల ధరల పెంపుతో రైతులపై తీవ్ర భారం పడుతోంది. వెంటనే ధరలను తగ్గించాలి.