ఆఫర్లంటూ అడ్డగోలు ప్రచారం.. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో ఆకర్శించే రీల్స్..
ABN , Publish Date - Jan 27 , 2026 | 08:00 AM
సోషల్ మీడియా ద్వారా ఆఫర్లంటూ ప్రకటనలు గుప్పిస్తూ.. ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి పక్రటనలు ఎక్కువయ్యాయి. అయితే.. ఈ మోసపూరిత ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది.
ఎగబడుతున్న జనం.. తీవ్ర ఇబ్బందులు
అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వహణ
ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ: ఆఫర్ల పేరుతో అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్(Insta, Facebook)లలో రీల్స్, ఆకర్షణీయ ప్రకటనలతో ఆకట్టుకుంటున్నారు. దీంతో జనం ఎగబడుతున్నారు. తోపులాటలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా రూ.26వేలకే కారు ఇస్తామంటూ నాచారం మల్లాపూర్‌కు చెందిన ఓ సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే నిర్వాహకులు సోషల్‌మీడియాలో ఆర్భాట ప్రచారం చేశారు. సోమవారం ఒక్కసారిగా వందలాది మంది ఆశావహులు అక్కడికి చేరుకున్నారు. ప్రచారంలో చెప్పింది ఒకటి.. అక్కడ జరిగింది మరొకటి కావడంతో కొనుగోలుదారులు అగ్రహంతో నిర్వాహకులపై తిరగబడ్డారు.
బ్రాండెడ్ ల్యాప్‌టాప్ పేరుతో..
ఇటీవల రూ. 4వేలకే బ్రాండెడ్ ల్యాప్‌లాప్ ఇస్తానంటూ.. ఓ సంస్థ ఆన్‌లైన్‌లో ఊదరగొట్టింది. దిల్‌సుఖ్‌నగర్(Dilsukhnagar)లోని తన దుకాణానికి రావాల్సిందిగా ఇన్‌స్టా రీల్స్ చేసి సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. నిజమని నమ్మిన ఆశావహులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకొని ఎగబడ్డారు. ఈ క్రమంలో అక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడటంతో ఊపిరాడక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలా బంపర్ ఆఫర్ల పేర్లతో ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తూ కొందరు జనాన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఈనేపథ్యంలో అనుమతి తీసుకోకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి ప్రచారాల వల్ల అక్కడ అత్యవసర పరిస్థతి ఏర్పడటం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటం, విపరీతంగా ట్రాఫిక్ జామ్ వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
స్కీముల పేరుతో స్కాములు చేస్తే కఠిన చర్యలు
భారీ ఆఫర్స్ ప్రకటించిన నిర్వాహకులు అందుకు తగ్గట్టుగా వందలాది మంది ఆశావహులు వస్తారని గుర్తించాలి. క్రౌడ్ కంట్రోల్ కోసం ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. ఎలాంటి అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వహించినా, వచ్చిన జనం ఇబ్బందులు పడి ట్రాఫిక్ సమస్యలు తతెత్తినా, ఏదైనా అనుకోని సంఘటనలు, ప్రమాదం జరిగినా అందుకు నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. స్కీములు పెట్టి.. స్కాములు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తాం. సినిమా సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లైనా, ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్సర్స్ అయినా చట్టపరమైన చర్యల నుంచి ఎవరూ తప్పించుకోలేరు.
వి.సి. సజ్జనార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్
ఈ వార్తలు కూడా చదవండి.
హింసను ప్రశ్నించినా బెదిరింపులే!
Read Latest Telangana News and National News