Share News

ప్రతి ఠాణాలో సైబర్‌ వారియర్లు

ABN , Publish Date - Aug 08 , 2026 | 08:22 AM

సైబర్‌ నేరాలను ఎదుర్కోవడం.. కనిపించని శత్రువుతో చేస్తున్న యుద్ధమని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్‌ అన్నారు.

ప్రతి ఠాణాలో సైబర్‌ వారియర్లు
Shikha Goel

  • త్వరలో ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైం పోలీస్ స్టేషన్‌

  • రాష్ట్రంలో నమోదవుతున్న ప్రతి నాలుగు..

  • నేరాల్లో ఒకటి సైబర్‌ మోసం కేసు ఉంటోంది

  • ప్రజల్లో అవగాహనకు కృషిచేస్తున్నాం

  • డిజిటల్‌ అరెస్టు నేరాలు తగ్గుతున్నాయి

  • సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్‌

హైదరాబాద్‌: సైబర్‌ నేరాలను ఎదుర్కోవడం.. కనిపించని శత్రువుతో చేస్తున్న యుద్ధమని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్‌ అన్నారు. సైబర్‌ నేరగాళ్లను కట్టడి చేయడం, బాధితులు పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేయడంతోపాటు మరికొంత మంది సైబర్‌ నేరాల పాలిట పడకుండా నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం తమ లక్ష్యమని చెప్పారు. గతంలో ‘ఫ్రాడ్‌ కా ఫుల్‌స్టాప్‌’ అంటూ చేపట్టిన ప్రచార కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లడంతో డిజిటల్‌ అరెస్టుల కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. సైబర్‌ నేరాల సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి సైతం తీవ్రంగా పరిగణించడంతో.. ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్‌ను సైబర్‌ నిపుణుడిగా తీర్చిదిద్ది సైబర్‌ వారియర్‌ పేరిట క్షేత్రస్థాయికి పంపించామన్నారు. త్వరలో ప్రతి జిల్లాలోనూ సైబర్‌ క్రైం పోలీస్ స్టేషన్లు రానున్నాయని, ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని వెల్లడించారు. భవిష్యత్తులో సైబర్‌ వారియర్ల సంఖ్యను పెంచుతామన్నారు. ఈ మేరకు శిఖా గోయల్‌ ‘ఆంధ్రజ్యోతి’తో ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ వివరాలు..


తెలంగాణ సైబర్‌ క్రైం పోలీసులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సైబర్‌ నేరం ఏది?

తెలంగాణ పోలీసులే కాదు.. దేశవ్యాప్తంగా పోలీసు సంస్థలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న భారీ ముప్పు ఇన్వె్‌స్టమెంట్‌ ఫ్రాడ్‌. తెలంగాణలో నమోదవుతున్న సైబర్‌ నేరాల్లో 60 శాతం ఇన్వె్‌స్టమెంట్‌ మోసాలే. విద్యావంతులే ఇందులో మోసపోతున్నారు. అత్యాశకు పోవడం వల్ల భారీ లాభాల ఆకర్షణలో పడి దాదాపు రూ.800 కోట్లు నష్టపోయారు. ఈ ఏడాది అన్ని సైబర్‌ నేరాల్లో కలిపి రూ.616 కోట్లు నష్టపోతే.. ఇందులో ఇన్వె్‌స్టమెంట్‌ ఫ్రాడ్‌ కేసుల్లో నష్టమే రూ.370 కోట్ల వరకు ఉంది. ఇన్వె్‌స్టమెంట్‌ ఫ్రాడ్‌ నేరాలకు పాల్పడుతున్న సైబర్‌ క్రిమినల్స్‌ చాలావరకు విదేశాల నుంచి ఆపరేట్‌ చేస్తున్నారు. వీరు సూచించిన ఖాతాల్లో డబ్బు పడిన తర్వాత.. అతి తక్కువ సమయంలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మ్యూల్‌ ఖాతాలకు బదిలీ అవుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి అవగాహన కార్యక్రమం చేపట్టాం. ‘సురక్షా కా తిరంగా’ పేరిట నెల పాటుఅవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.


డిజిటల్‌ అరెస్టు మోసాలపై ప్రధానితోపాటు, సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలో డిజిటల్‌ అరెస్టు కేసుల పరిస్థితేంటి?

డిజిటల్‌ అరెస్టు మోసాలు మొదట్లో పెద్దసంఖ్యలోనే నమోదయ్యాయి. వీటిని అడ్డుకోవడానికి ‘ఫ్రాడ్‌ కా ఫుల్‌ స్టాప్‌’ అంటూ భారీ ప్రచారం చేపట్టి ప్రజల్లో అవగాహన తీసుకురావడంతో ఈ నేరాలు 60 శాతం తగ్గుముఖం పట్టాయి. ఆర్థిక నష్టాన్ని 47 శాతం తగ్గించగలిగాం.


సైబర్‌ నేరగాళ్లు ఏఐ, డీప్‌ఫేక్‌ వీడియోలు, వాయిస్‌ క్లోనింగ్‌ వంటి సాంకేతికతను వాడుతున్న నేపథ్యం ఎలా ఎదుర్కొంటున్నారు?

శిఖా గోయల్‌: సైబర్‌ నేరగాళ్లు వాడే సాంకేతికతను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకుంటున్నాం. కత్తికి కత్తితోనే సమాధానం చెప్పాలి. అందుకే సైబర్‌ నేరాల దర్యాప్తులో కృత్రిమ మేధను అనేక ప్రాంతాల్లో వాడుతున్నాం. నేరస్తుల గుర్తింపు, మోసం తీరు, వేగవంతమైన ఫిర్యాదుల వ్యవస్థ, శరవేగంగా తీసుకునే రికవరీ చర్యలు వీటిని అడ్డుకోవడంలో ఉపయోగపడుతున్నాయి. గతంలో 1930కి ఫోన్‌ చేస్తే వెయిటింగ్‌ టైమ్‌ వచ్చేది. ఇప్పుడు ఇందులో ఏఐ వ్యవస్థను అనుసంధానించడం ద్వారా వెయిటింగ్‌ టైమ్‌ను జీరోకు తీసుకొచ్చాం. 1930కి కాల్‌ చేయగానే ఆటోమేటిక్‌గా ఫిర్యాదు నమోదవుతోంది. అలాగే చిన్నారుల లైంగిక వేధింపుల రక్షణ వ్యవస్థలోనూ ఏఐను వాడటం ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నాం. ఇంట్రా జీపీటీ, డేటా అనలిటిక్స్‌లో మనం అవలంబిస్తున్న విధానాలను పరిశీలించడానికి కేంద్ర ప్రతినిధులు కూడా వచ్చారు.


మయన్మార్‌, కాంబోడియా, చైనా దేశాల నుంచి నడుస్తున్న సైబర్‌ గ్యాంగ్‌లపై పోరాటమెలా?

ఇది అన్ని రాష్ట్రాల పోలీసులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. సైబర్‌ నేరానికి పాల్పడుతున్న వారిలో రెండు రకాలు ఉన్నారు. వ్యవస్థీకృత సిండికేట్లు, సాధారణ సైబర్‌ క్రిమినల్స్‌. వీరంతా దోచుకున్న డబ్బును మ్యూల్‌ ఖాతాలకు మళ్లిస్తున్నారు. అత్యధిక మొత్తం కొట్టేస్తున్న ముఠాలు దేశం బయటి నుంచి ఆపరేట్‌ చేస్తున్నాయి. వారు కనిపించని శత్రువులు. వారిని పట్టుకోవడానికి కేంద్ర, రాష్ట్ర సంస్థలు సమన్వయంతో పనిచేస్తేనే విజయం సాధిస్తాం. రామగుండం కేసులో చైనీయుల్ని అరెస్టు చేయగలిగాం.


మ్యూల్‌ బ్యాంకు ఖాతాలు, క్రిప్టో, హవాలా మార్గాల్లో డబ్బు దేశం దాటకుండా ఏ విధమైన చర్యలు తీసుకోగలుగుతున్నారు?

సైబర్‌ నేరాల్లో మనీ ట్రయల్‌ అనేది ముఖ్యమైన దర్యాప్తు అంశం. బాధితుడు పోగొట్టుకున్న డబ్బు ఏ ఖాతాలకు వెళ్లింది? అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్లింది? ఎంత సమయంలో డబ్బు బదిలీ ప్తూరయింది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. హైదరాబాద్‌లో సైబర్‌ నేరం ద్వారా రూ.1 కోటి దోచుకుంటే ఒక ఖాతా నుంచి దేశం నలుమూలల ఉన్న మ్యూల్‌ ఖాతాలకు దానిని బదిలీ చేస్తున్నారు. దీనిని అడ్డుకోవాలంటే సత్వరం ఫిర్యాదు అందితేనే సాధ్యం.


గోల్డెన్‌ అవర్‌ ఫిర్యాదు వల్ల కలిగే ఉపయోగమేంటి?

రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు గాయపడ్డ వ్యక్తిని ఎంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళితే అంత ఎక్కువగా కోలుకునే అవకాశాలున్నట్లే.. సైబర్‌ నేరాల్లో ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత త్వరగా డబ్బును రికవరీ చేయడానికి వీలవుతుంది. డబ్బు అనేది బ్యాంకింగ్‌ చానల్స్‌లో ఉంటే.. దానిని ఫ్రీజ్‌ చేయగలం. విత్‌డ్రా అయితే ఏమీ చేయలేం. గోల్డెన్‌ అవర్‌ అంటే ఇదే. నాచారం ప్రాంతానికి చెందిన ఒక పారిశ్రామికవేత్త నుంచి సైబర్‌ నేరగాడు రూ.10 వేలు, రూ.50 లక్షలు, రూ.50 లక్షల చొప్పున కేవలం పది నిమిషాల వ్యవధిలో దోచుకున్నాడు. ఆ పారిశ్రామికవేత్త బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్‌లను చూసి డబ్బు పోయిన ఆరు నిమిషాల్లో 1930కి ఫిర్యాదు చేశారు. అది రెండో శనివారం బ్యాంకులకు సెలవు అయినా.. మా బ్యూరో సిబ్బంది ఢిల్లీ స్థాయిలో బ్యాంకింగ్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును ఫ్రీజ్‌ చేయించగలిగాం. ఇందులో సైబర్‌ నేరగాడి కొరియర్‌ కేవలం రూ.300 పెట్రోల్‌ పోయించుకోవడానికి వాడుకున్నాడు.


zz.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

మూసీ ప్రాజెక్టుకు లైన్‌క్లియర్‌

కోటీశ్వరులకు రైతుబంధు ఎందుకు?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 08:22 AM