మూసీ ప్రాజెక్టుకు లైన్‌క్లియర్
ABN , Publish Date - Aug 08 , 2026 | 06:31 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీనది తీర అభివృద్ధి ప్రాజెక్టుకు అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి.
మొదటి దశకు పర్యావరణ అనుమతులు మంజూరు
రూ.7,055 కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు
495 ఎకరాల నదీ తీర ప్రాంత అభివృద్ధికి చర్యలు
ఇందులో 146 ఎకరాల వరకు పట్టా భూమి
639 వరకు శాశ్వత, తాత్కాలిక నిర్మాణాల తొలగింపు
ఎస్‌ఈఐఏఏకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్న ప్రభుత్వం
2028 వరకు ఫేజ్-1 పూర్తి చేయాలని గడువు
హైదరాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీనది తీర అభివృద్ధి ప్రాజెక్టుకు అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టు మొదటి దశకు తెలంగాణ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ (ఎస్‌ఈఐఏఏ) ఈ నెల 5న ముందస్తు పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. దీంతో దసరా లోపు టెండర్లను ఆహ్వానించి మూసీనది మొదటి దశ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుంచి దాదాపు రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని,
2027 డిసెంబరు లేదా 2028 ప్రారంభానికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించింది. మూసీనది మొత్తం 55 కిలోమీటర్ల అభివృద్ధి పనులను 2030 నాటికి పూర్తి చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ మహా నగరంలో ప్రవహిస్తున్న మూసీనదిని ఐదు జోన్లుగా విభజించి పునరుజ్జీవం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. 1వ జోన్‌గా ఉన్న 21 కిలోమీటర్ల మూసీనది ప్రాంతాన్ని ఫేజ్-1 కింద అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశ మూసీ అభివృద్ధిలో పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ ఉండేలా రూపకల్పన చేశారు. ఈ దశలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ‘వి’ ఆకారంలో చేపట్టనున్నారు. ఫేజ్-1 అభివృద్ధికి రూ.7,055 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా, ఇందులో ఫేజ్-1ఏకు రూ.3105 కోట్లు, ఫేజ్-1బీకి 3,950 కోట్లుగా అంచనా వేశారు.
అభివృద్ధి ప్రతిపాదనలు ఇలా..
తెలంగాణ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ నుంచి మూసీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పొందడానికి ఎంఆర్‌డీసీఎల్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదికను సమర్పించారు. అందులో ప్రధానంగా మూసీనదిలో వరద నివారణ చర్యల అభివృద్ధి, నదీతీర ప్రాంతంలో పర్యావరణ పునరుద్ధరణలో భాగంగా ల్యాండ్ స్కేప్‌లు, పచ్చదనాన్ని అభివృద్ధి చేయనున్నారు. వీటితోపాటు వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీగా 30 మీటర్ల రహదారులు, సర్వీసు రోడ్లు, ఫుట్‌పాత్‌లు, నదిలో చెక్ డ్యామ్‌లు, కల్చరల్ ప్లేస్‌లు, పార్కులు రానున్నాయి. మురుగునీటి పంపింగ్ స్టేషన్లు, మురుగు నియంత్రణ వ్యవస్థలను మురుగు శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ)కు అనుసంధానం చేయనున్నారు.
పర్యావరణ పునరుద్ధరణలో భాగంగా నదీతీర ఆవాసాల పునరుద్ధరణ, స్థానిక మొక్కల పెంపకం, చిత్తడి నేలల అభివృద్ధి, గ్రీన్ కారిడార్లు, జీవవైవిధ్య పెంపు, వాతావరణ మార్పులను తట్టుకోగలిగే ల్యాండ్‌స్కే్‌పలు ఉండనున్నాయి. అదేవిధంగా నది సహజ పర్యావరణాన్ని రక్షించడానికి వర్షాకాలంలో 30 శాతం సగటు ప్రవాహం ఉంటుందని, మిగతా నాలుగు నెలల్లో కనీసం 20 శాతం సగటు ప్రవాహం ఉండేలా చర్యలు తీసుకుంటామని నివేదికలో పేర్కొన్నారు. నది సహజ స్వరూపం మార్చకుండా అభివృద్ధి చేస్తామని వివరించారు. నిర్మాణ దశలో రోజుకు 1050 కిలోలు, నిర్వహణ దశలో రోజుకు 2,783 కిలోల ఘన వ్యర్థాలు ఉ్పత్పత్తి అవుతాయని అంచనా వేశారు.
495 ఎకరాల నదీ తీర ప్రాంత అభివృద్ధి..
ఫేజ్-1లో అభివృద్ధి చేసే మూసీనది తీర ప్రాంతం మొత్తం 495 ఎకరాలు ఉండనుంది. ఇందులో 158 ఎకరాలను రోడ్ల అభివృద్ధికి కేటాయించారు. 138 ఎకరాలను పచ్చని ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి, మరో 128 ఎకరాలను నది పరిరక్షణ చర్యలకు, ప్రహరీ నిర్మాణానికి వినియోగించనున్నారు. 54 ఎకరాల వరకు వివిధ రకాల సౌకర్యాలు కల్పించడానికి ఉపయోగించనున్నారు. ఇందులో నిర్మాణాలు ఐదు ఎకరాలకు మించకుండా చర్యలు తీసుకోనున్నారు. దాదాపు 32 వేల చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని ప్రత్యేకంగా వాహనాల పార్కింగ్ కింద చూపారు.
అయితే ఈ మొత్తం 495 ఎకరాల్లో 158 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నట్లు, 146 ఎకరాల వరకు పట్టా భూమి, 30 ఎకరాల వరకు రక్షణ శాఖ భూములు, 126 ఎకరాల నదీ తీర ప్రాంతం ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. కాగా, మొదటి దశలో అభివృద్ధి చేసే ప్రాంతంలో సుమారు 639 వరకు శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 2,660 చెట్లు ప్రభావితమవుతాయని అంచనా వేశారు. ఇందులో వీలైనంత వరకు ట్రాన్స్‌లొకేషన్ చేస్తామని, ఒకవేళ చెట్టు నరికితే 1ః10 నిష్పత్తిలో కొత్త మొక్కలు నాటుతామని పేర్కొన్నారు.