రాబడి పెరగాలి... వ్యాపారం సాగాలి
ABN , Publish Date - Aug 08 , 2026 | 05:44 AM
పన్ను వసూళ్లలో టెక్నాలజీ వాడుకోవడమంటే వ్యాపారులను వేధించడం కాదని, రాష్ట్ర ఖజానాకు రాబడిని పెంచుకుంటూనే సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
అన్ని శాఖల సమన్వయంతో జీఎస్టీ పెంచాలి
నిర్మాణ సామగ్రి జీఎస్టీలో లీకేజీలున్నాయి
అనుమతుల దశలోనే పన్ను అంచనా వేయండి
ఏఐతో పని సులభతరం చేస్తాం: సీఎం రేవంత్
ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో భేటీ
సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఉన్నతాధికారులు
హైదరాబాద్, ఆగష్టు 7 (ఆంధ్రజ్యోతి): పన్ను వసూళ్లలో టెక్నాలజీ వాడుకోవడమంటే వ్యాపారులను వేధించడం కాదని, రాష్ట్ర ఖజానాకు రాబడిని పెంచుకుంటూనే సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఏఐ ఆధారిత వ్యవస్థల అమలులో వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించే విషయమై శుక్రవారం ఆయన ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగడంపై చర్చించారు. ముఖ్యంగా జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై ముఖ్యమంత్రి లోతుగా చర్చించారు. జీఎస్టీ అధికారులకు ఏఐ ఆధారిత సమాచారంతో పనిని సులభతరం చేసే వ్యవస్థను తెస్తామని సీఎం చెప్పారు. ఈ క్రమంలో వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుతూనే సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)ను మెరుగుపరిచేలా టెక్నాలజీ వినియోగం ఉంటుందని సుబ్రమణియన్ వివరించారు. భవన, నిర్మాణ సామగ్రి విషయంలో లీకేజీలను అరికట్టే విధంగా మున్సిపల్, రెరా, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ధిక, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఏఐ సాయంతో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు సంబంధించిన అనుమతులను దరఖాస్తు దశలోనే నిర్మాణ సామగ్రి అవసరాలను, దానికి అనుగుణంగా పన్నుల అంచనాల వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు. మీ-సేవ, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్ వివరాలను కూడా సమీకృతం చేస్తే పరిపాలనతో ఉపయోగపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.