Share News

ప్రక్షాళనకు అడ్డుపడితే మూసీలో వేసి తొక్కుతాం..

ABN , Publish Date - Jun 29 , 2026 | 05:20 AM

మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డుపడ్డా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అడ్డొచ్చిన వారిని మూసీలో వేసి తొక్కి మరీ ప్రక్షాళన చేసి తీరతామని ప్రకటించారు.

ప్రక్షాళనకు అడ్డుపడితే మూసీలో వేసి తొక్కుతాం..

  • కాలుష్యంతో ప్రజలు అనుభవిస్తున్న గోస చూస్తున్నాం

  • కలెక్షన్లు, ఎలక్షన్లు, సెలక్షన్లే బీఆర్‌ఎస్‌ చేసిన త్యాగాలు

  • భార్యాభర్తల ఫోన్లు విన్నవారిని చెప్పులతో కొట్టాలా? వద్దా?

  • బావ బావమరిది తోడేళ్లలా తెలంగాణపై పడి తిరుగుతున్నారు

  • బీఆర్‌ఎస్‌ నేతల ఒంటినిండా విషం.. మూసీ కన్నా కంపు

  • ప్రజా ప్రభుత్వం కావాలా? పాపాల భైరవుడి పాలన కావాలా?

  • 2034 వరకు కాంగ్రెస్సే రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది

  • నల్లగొండ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • 13,006 కోట్లతో హ్యామ్‌ రోడ్ల పథకానికి కనగల్‌లో శంకుస్థాపన

నల్లగొండ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డుపడ్డా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అడ్డొచ్చిన వారిని మూసీలో వేసి తొక్కి మరీ ప్రక్షాళన చేసి తీరతామని ప్రకటించారు. మూసీ కాలుష్యంతో ప్రజలు ఎంత గోస అనుభవిస్తున్నారో చూస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ.. సబర్మతి నదిని, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి.. యమునా నదిని ప్రక్షాళన చేసిన దానికంటే గొప్పగా మూసీని ప్రక్షాళించి ప్రపంచ దేశాల నుంచి ఇక్కడకు వచ్చి చూసి వెళ్లేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా రూ.13,006.27 కోట్లతో చేపట్టిన హ్యామ్‌ రోడ్ల పథకానికి ఆదివారం నల్లగొండ జిల్లా కనగల్‌ వద్ద ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పథకానికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అక్కడి నుంచి నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకొని అక్కడ రూ.83 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని ఎన్‌జీ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ఫై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీపై విమర్శలు చేశారు. ‘‘రెండున్నరేళ్లలో రేవంత్‌రెడ్డి ఏం తెచ్చారు, ఏం చేశారు అని అడుగుతున్నారు. వారికి సవాల్‌ విసురుతున్నా. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన, పన్నెండేళ్ల కేంద్రంలోని బీజేపీ పాలన, రెండున్నరేళ్ల మా ప్రజాపాలనపై అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రత్యేకంగా చర్చిద్దాం. తెలంగాణ ప్రజలకు ఎవరం ఏం చేశామో తేలుద్దాం’’ అని సీఎం రేవంత్‌ సవాల్‌ విసిరారు.

7.jpg


త్యాగాలు ఎవరివి?

బీఆర్‌ఎస్‌ నేతలు పదే పదే త్యాగాలు చేశామని, తమ త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైందని చెబుతున్నారని, అసలు త్యాగాలు ఎవరివని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘రాజీనామాలు, కలెక్షన్లు, సెలక్షన్లు, ఎలక్షన్లతో పబ్బం గడిపిన మీది త్యాగమైతే.. తెలంగాణ తొలి ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తప్ప పదవులు చేపట్టబోనని ప్రతిన బూనిన కొండా లక్ష్మణ్‌బాపూజీ త్యాగం ఏమవుతుంది? మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి, తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నల్లగొండ గడ్డపై ఆమరణ దీక్ష చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్యాగం ఏమవుతుంది? రూ.100తో పెట్రోల్‌ తెచ్చుకుని, అర్ధరూపాయి పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలేని అగ్గిపెట్టెరావుది త్యాగమా? లేక ఒంటి నిండా మంట పెట్టుకుని నిలువునా దహించుకుపోయిన అమరుడు శ్రీకాంతాచారిది త్యాగమా? మీవి త్యాగాలైతే.. కానిస్టేబుల్‌ కిష్టయ్య, ఇషాన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, యాదయ్య చేసినవి ఏమవుతాయి?’’ అని రేవంత్‌ నిలదీశారు. రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన బీఆర్‌ఎస్‌ వందేళ్ల విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు. రూ.60 వేల కోట్ల నుంచి రూ.8 లక్షల కోట్లకు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. బావ, బావమరిది (హరీశ్‌రావు, కేటీఆర్‌ను ఉద్దేశించి) తోడేళ్లలా తెలంగాణ మీద పడి తిరుగుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలెవరూ మళ్లీ వారు రావాలని కోరుకోవడం లేదని, వారి కుటుంబం, వారి దోపిడీకి, దొంగతనాలకు అండగా ఉన్నవారే మళ్లీ వారి పాలన రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలు మాత్రం వారిని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేశారని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని నల్లగొండ గడ్డమీద నుంచి వేలాది మంది చెబుతున్నారని, వాళ్లను ఉప్పుపాతర వేశామని చెబుతున్నారని సీఎం పేర్కొన్నారు.


ఆ పార్టీ నేతలు ఒంటి నిండా విషం నింపుకొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూసీ నది కాలుష్యం కంటే వారి కడుపులోనే ఎక్కువ కంపు ఉందన్నారు. ‘‘ఈ సభకు వేలాది మంది ఆడబిడ్డలు వారికి నేను పండగకు సారె పంపిన చీరలు కట్టుకొని సంతోషంగా వచ్చారు. కానీ, బీఆర్‌ఎస్‌ వాళ్లు వారి మొదటి ఐదేళ్ల పాలనలో ఒక్క ఆడబిడ్డకైనా మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. పేదలంటే గుర్తింపుగా ఉండే రేషన్‌కార్డు అడిగితే జైళ్లలో పెట్టారు. మా ప్రభుత్వం వచ్చాక లక్షలాది మంది పేదలకు రేషన్‌కార్డులు ఇచ్చాం. ఆనాడు పేదలకు రేషన్‌ బియ్యం ఇస్తే బర్రెలకో, లేక తిరిగి వ్యాపారులకో ఇవ్వాల్సి వచ్చేది. కానీ, మా ప్రభుత్వం వచ్చాక పేదలందరికీ సన్నబియ్యం ఇవ్వాలనే సంకల్పంతో ఏడాదికి రూ.16 వేల కోట్లు వెచ్చించి 3.28 కోట్ల మందికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నాం. ఇక ఇందిరమ్మ ఇళ్లపథకం పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 4.50లక్షల ఇళ్లను అందజేశాం. గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల్లో కేసీఆర్‌, జున్వాడలో వంద ఎకరాల్లో కేటీఆర్‌, మొయినాబాద్‌లో 50 ఎకరాల్లో హరీశ్‌రావు, శంకర్‌పల్లిలో 20ఎకరాల్లో కవిత ఫాంహౌ్‌సలు నిర్మించుకున్నారే తప్ప.. ఏనాడూ పేదల గురించి ఆలోచించలేదు’’అని ధ్వజమెత్తారు.

2.jpg


పాపాల భైరవుడి పాలన రావాలని ప్రయత్నాలు..

రాష్ట్రంలో ప్రజాపాలన పోవాలని, పాపాల భైరవుడి పాలన రావాలని బిల్లా, రంగాలు ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే ప్రజాపాలన ఎందుకు పోవాంటూ ప్రజలే వారిని ప్రశ్నించాలని సూచించారు. ‘‘వందేళ్లలో కులగణన చేయకపోతే, తమ ప్రభుత్వంలో జనగణనలోనే కులగణన చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చినందుకు మా ప్రభుత్వం పోవాలా? 30 నెలల్లో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకా? 30 నెలల్లో 1.56 లక్షల కోట్లు వెచ్చించి రుణమాఫీ, రైతుభరోసా, బోనస్‌ అందించి వ్యవసాయాన్ని పండగ అని నిరూపించినందుకా? స్కిల్‌ యూనివర్సిటీ నెలకొల్పినందుకు, పాలిటెక్నిక్‌ కాలేజీలను పునరుద్ధరించినందుకు, మీరు వదిలేసిన ఎస్‌ఎల్‌బీసీని మళ్లీ పూర్తిచేసి నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నందుకా? పేదలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నందుకా? 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్‌ అందిస్తుందుకు ప్రజా ప్రభుత్వం పోవాలా?’’ అని ప్రశ్నించారు. అధికారుల పోన్లు, రాజకీయ నేతల ఫోన్లు మాత్రమే కాకుండా భార్యాభర్తల ఫోన్లను ఫాంహౌస్‌‌లలో కూర్చుని విన్నవారిని రబ్బరు చెప్పులతో కొట్టాలో వద్దో ప్రజలే చెప్పాలని సీఎం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్లు ఖర్చుపెడితే.. అది మూడేళ్లలోనే కూలిపోయి కూలేశ్వరం అయిందని విమర్శించారు. అప్పటి గవర్నర్‌కు మాయమాటలు చెప్పి కాళేశ్వరరావు అని పిలిపించుకున్న హరీశ్‌రావు ఇప్పుడు అది కూలిపోతే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఫాంహౌస్‌లోని శుక్రాచార్యుడు, మారీచుడు, సుభాహు మాదిరి బీఆర్‌ఎస్‌ నేతలు మారిపోయారని, నిజం మాట్లాడితే వారి తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం ఉందన్నారు. అందుకే అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు.

3.jpg


హామ్‌లో గ్రామీణ రోడ్ల నిర్మాణం.. జూలైలో టెండర్లు పూర్తి!

  • పీఆర్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రణాళిక

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘హామ్‌’ పద్ధతిలో చేపట్టే ఈ రోడ్ల నిర్మాణానికి.. జూలైలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేయనుంది. మొదటిదశలో భాగంగా 6,294.81కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 7,449 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 2,162రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఈ పనులను మొత్తం 17 ప్యాకేజీలుగా విభజించి టెండర్లను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బిడ్ల పరిశీలన పూర్తి చేసి, 14 ప్యాకేజీలకు సంబంధించిన లెటర్‌ ఆఫ్‌ అవార్డ్స్‌(ఎల్‌వోఏ) జారీ చేశారు.

4.jpg

75వేల కోట్లతో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి

  • ఇందిరా, వైఎస్‌ల తర్వాత పేదల కోసం పని చేస్తోంది సీఎం రేవంతే

  • రహదారులు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రాష్ట్రంలో దాదాపు రూ.75వేల కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేపట్టామని రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇందిరాగాంధీ, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తర్వాత అంతేస్థాయిలో సీఎం రేవంత్‌రెడ్డి పేదల కోసం పని చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా విరామం లేకుండా పని చేస్తున్నారని వివరించారు. ఈ రోడ్ల ఏర్పాటుతో కేవలం రహదారులే కాదని, ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. త్వరలోనే ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల మీదుగా ఏపీలోని బందర్‌పోర్టు వరకు 12లైన్ల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి వస్తుందన్నారు. ఆ రహదారి పక్కనే బుల్లెట్‌ట్రైన్‌ రూట్‌ కూడా ఏర్పాటవుతుందని వివరించారు. ఏ రాష్ట్రంలో లేని రీతిలో హ్యామ్‌రోడ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని, ఈ పథకం ద్వారా కాంట్రాక్టు సంస్థలే 15 ఏళ్ల పాటు రహదారులను నిర్వహిస్తాయని తెలిపారు. టెండర్లు ఓపెన్‌ చేయకుండానే బీఆర్‌ఎస్‌ నేతలు స్కామ్‌ జరిగిందని దుష్ప్రచారం చేశారని, తాము మంచి చేస్తుంటే కాళ్లల్లో కట్టెలు పెట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో వారు దోచుకున్నట్లే అందరూ ఉంటారని భావిస్తున్నారని వివర్శించారు. పచ్చకామెర్లున్న వారికి లోకమంతా పచ్చగా కనబడ్డట్లు, హరీశ్‌రావు అన్ని పథకాల్లో స్కాములే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ నేతలు ఏం చేశారో జనానికి తెలుసునన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయడం కోసం తాము కష్టపడుతుంటే, బీఆర్‌ఎస్‌ వాళ్ల కళ్లుమండుతున్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో వంద సీట్లు గెలవబోతున్నామని, దానికి తామంతా కష్టపడి పనిచేస్తామని పేర్కొన్నారు.


2034 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే..

రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తామిచ్చిన హామీలే కాకుండా.. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలుపుతామని, తమకు ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఆనాడు వైఎస్‌ఆర్‌ ప్రభుత్వంలో నల్లగొండ గడ్డ నుంచి జానారెడ్డి, కోమటిరెడ్డి పట్టుబట్టి ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని సాధించారని, వారి హయాంలోనే 34 కిలోమీటర్ల సొరంగం తవ్వించారని సీఎం తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో మిగిలిన పది కిలోమీటర్ల సొరంగం తవ్వించకుండా ప్రాజెక్టును గాలికొదిలేసి నల్లగొండ బిడ్డల ఉసురుపోసుకున్నారని విమర్శించారు. తాము ఈ టర్మ్‌లోనే ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తిచేసి నల్లగొండను సస్యశ్యామలం చేస్తామన్నారు. తులసివనంలో గంజాయి మొక్కలాగా సూర్యాపేటలో ఒక జానెడోడు మిగిలాడని, ఇకపై ఆ జానెడోడిని కూడా మొలవనివ్వబోమని ప్రజలు చెబుతున్నారని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కుందూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 06:02 AM