ఇక దూకుడే
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:50 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గేరు మార్చి.. స్పీడు పెంచబోతోంది. పాలనను టాప్‌గేర్‌లో పెట్టబోతోంది. ప్రతిపక్షాల విమర్శలకు ఫుల్‌స్టాప్ పెట్టేలా, ప్రజలకు మరింత దగ్గరయ్యేలా వ్యూహరచన చేస్తోంది.
స్పీడు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు
ఫలితాల సాధనకు ఇక రెండేళ్లే సమయం
చివరి ఆరు నెలలంతా ఎన్నికల హడావుడే
అందుకే పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి
భారీ మార్పులు చేపడుతున్న సీఎం రేవంత్
సమర్థులైన అధికారులకు పాలనా పగ్గాలు
కాబోయే సీఎస్ సంజయ్‌జాజుకు దిశానిర్దేశం
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గేరు మార్చి.. స్పీడు పెంచబోతోంది. పాలనను టాప్‌గేర్‌లో పెట్టబోతోంది. ప్రతిపక్షాల విమర్శలకు ఫుల్‌స్టాప్ పెట్టేలా, ప్రజలకు మరింత దగ్గరయ్యేలా వ్యూహరచన చేస్తోంది. తాను చేపట్టిన ప్రతిష్ఠాత్మక పథకాలకు పూర్తి స్థాయి ఫలితాలు సాధించే దిశగా చర్యలు తీసుకోబోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి రెండున్నరేళ్లు పూర్తయింది. ఎన్నికలకు ఇంకా మిగిలింది మరో రెండున్నరేళ్లే. చివరి ఆరు నెలల్లో అంతా ఎన్నికల హడావుడే ఉంటుంది. అంటే.. ప్రభుత్వం తాను తలచింది చేయాలన్నా, చేసింది చెప్పాలన్నా, వచ్చే ఎన్నికల కోసం సిద్ధం కావాలన్నా.. రెండేళ్లలోనే చేయాలి. దీంతో ఈ రెండేళ్ల సమయం రేవంత్ సర్కారుకు అత్యంత కీలక దశ కానుంది. చేపట్టిన పథకాలకు పూర్తి స్థాయి ఫలితాలు రాబట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇందుకోసం సమర్థ అధికార యంత్రాంగం అవసరమని భావించిన సర్కారు శుక్రవారం భారీ మార్పులు చేసింది. పథకాల అమలులో సమర్థుడైన ఐఏఎస్ సంజయ్ జాజును సీఎస్‌గా నియమించింది. సీఎంవోలోనూ మార్పులు చేసింది. జూలై మొదటి పక్షంలో మరిన్ని మార్పులు చేసే ఆలోచనలో ఉంది.
మూసీ ప్రాజెక్టుపై ముందుకే..
ఇప్పటికే ప్రభుత్వం పలు దీర్ఘకాలిక ప్రాజెక్టులను ప్రారంభించింది. మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టును గాడిలో పెట్టే దిశగా చర్యలు చేపడుతోంది. దీనికి అవసరమైన కేంద్ర రక్షణ శాఖ భూములపై అనుమతులు సాధించింది. ప్రాజెక్టు కోసం అప్పు సాధించడమే మిగిలి ఉంది. కేంద్రం నుంచి ఎలాంటి నిధులు వచ్చే సూచనలు కనిపించకపోవడంతో ప్రభుత్వమే సొంతంగా ప్రాజెక్టు చేపట్టేలా కసరత్తు చేస్తోంది. దీనికి భారీ రుణం తీసుకునే దశగా చర్యలు చేపట్టింది. ఇలాంటి ప్రాజెక్టు సాకారమైతే... జీహెచ్‌ఎంసీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అనుకూల ఫలితాలు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. అందుకే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ఎన్ని అవాంతరాలు వచ్చినా, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురైనా ముందుకే వెళ్లాలని నిర్ణయించింది. అలాగే, ఒక్కో నియోజకవర్గంలో రూ.200 కోట్లతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభు త్వం నిర్మిస్తోంది. ఇది కూడా రేవంత్ సర్కారు డ్రీమ్ ప్రాజెక్ట్. ఒకే స్కూలు ఆవరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులంతా ఉండేలా ప్రాజెక్టును తీర్చిదిద్దడం వల్ల అన్ని వర్గాల మనసులను చూరగొనవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన.

అందుకే ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అమలు చేస్తోంది. ఈ రెండేళ్లలో కొన్ని స్కూళ్లనైనా గాడిలో పెట్టాలని, ఆ ఆవరణల్లోకి విద్యార్థులను తరలించాలని యోచిస్తోంది. దీనికోసం సమర్థులైన అధికారులకు బాధ్యతలు అప్పగించనుంది. ఇక ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో పథకం ‘ఫ్యూచర్ సిటీ’. ఇప్పటికే 13,610ఎకరాలతో మాస్టర్ ప్లాన్‌ను సర్కారు విడుదల చేసింది. ఇందులో సెక్టార్ల వారీగా భూమిని కేటాయించాలని నిర్ణయించింది. లైఫ్ సైన్సెస్ హబ్ కు 4వేల ఎకరాలు, డేటా సిటీకి 1500 ఎకరాలు, రెసిడెన్షియల్ కాలనీలకు 2,477 ఎకరాలు కేటాయించనున్నట్లు ప్రకటించింది. గ్రీన్ ఫార్మా క్లస్టర్, ఏఐ సిటీ, యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ వంటి వాటికి ప్రాధాన్యమిస్తోంది. రానున్న ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టు ఫలితాలను ప్రజలకు చూపాలన్న దృఢ నిశ్చయంతో ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ప్రాజెక్టు విషయంలో తీసుకుంటు న్న చర్యలు, ప్రగతి నివేదికలపై ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. ఇది రాజకీయంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెడుతుందని భావిస్తున్నారు. ఇందులో భారీగా పె ట్టుబడులను సాధిస్తే.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు. ప్రముఖ కంపెనీలు రావడంవల్ల యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నది ప్రభుత్వ యోచన.
కొలిక్కివచ్చిన మెట్రోరైలు ప్రాజెక్టు..
మెట్రో రైలు ప్రాజెక్టు కూడా దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం జపాన్ సంస్థల నుంచి అందిన రూ.13,615 కోట్ల రుణం ప్రస్తుతం ఇండియన్ రైల్వే ఫైనా న్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) వద్ద ఇరుక్కుపోయింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కలిసి రావడాన్ని ప్రభుత్వం సానుకూలంగా మలుచుకోనుంది. ఐఆర్‌ఎఫ్‌సీ వద్ద ఉన్న రుణాన్ని సాధించుకునే దిశగా చర్యలు చేపట్టింది. ఈ రుణం అందితే.. మెట్రో రైలు రెండో దశ పనులను చేపట్టనుంది. ఇవి కాకుండా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభిస్తోంది. ఇటీవలే రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్లలో అన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక టి చొప్పున ఇలాంటి స్కూళ్లను ఏర్పాటు చేయాలన్న ది ప్రభుత్వ నిర్ణయం. ఇక ప్యారడైజ్ నుంచి మేడ్చ ల్, ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు రెండు ఎలివేటెడ్ కారిడార్లను సర్కారు చేపడుతోంది. ఈ కారిడార్లకు అవసరమైన రక్షణ శాఖ భూముల విషయంలో ఇటీవలే కేంద్ర రక్షణ శాఖ అనుమతులిచ్చింది. మరోవైపు తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును చేపట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ముంపు ప్రాంతాల విషయమై చర్చించడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర సీఎం రేవంత్ లేఖ కూడా రా శారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని విన్నవించారు. పాలమూరు ప్రాజెక్టునూ గాడిలో పెట్టే చర్యలు చేపడుతున్నారు.
కొత్త సీఎస్‌కు దిశా నిర్దేశం..
పథకాల చివరి ఫలితాలను సాధించాలన్న కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం.. వాటి అమలు బాధ్యతలను సమర్థ అధికారులకు అప్పగిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏరికోరి తెచ్చుకుంది. ఏదైనా పథకాన్ని ప్రారంభిస్తే.. దాని చివరి ఫలితం వచ్చేవరకు గట్టిగా అమలు చేసి తీరుతారని సంజయ్ జాజుకు పేరుంది. ఈ నెల 30 నుంచి చార్జి తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఆయనను పూర్తి స్థాయిలో రంగంలోకి దించనుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యాలను ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో దిశా నిర్దేశం చేశారని తెలిసింది. పెట్టుబడులను ఆకర్షిం చే చర్యల్లో భాగంగా సంజయ్‌జాజు పాత్రను కూడా మరింత కీలకం చేశారు. ఇందుకోసం ఆయన కు సీఎస్ బాధ్యతలతో పాటు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రత్యేక ప్రధానకార్యదర్శి బాధ్యతలు కూడా అప్పగించారు. సీఎం కార్యాలయంలోని ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్ సెల్ సీఈవో, స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ(స్పీడ్) సీఈవో పోస్టులను కూడా ఆయనకే అప్పగించారు. మరోవైపు గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఎన్.శ్రీధర్‌ను సీఎంవోలోకి తీసుకున్నారు. గతంలో సింగరేణి సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం శ్రీధర్‌కు ఉండడంతో సీఎంవోలో ఆయన కీలక భూమిక పోషిస్తారని భా విస్తున్నారు. సీఎంవోలో ఉన్న అజిత్‌రెడ్డిని బదిలీ చేసి, ఇన్వెస్ట్ తెలంగాణ విభాగం సీఈవోగా బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి కృషి చేస్తారని ప్రభుత్వం భావిస్తోంది. జూలై మొదటి పక్షంలో మరికొంత మంది విభాగాధిపతుల బదిలీలను చేపట్టే యోచనలో ఉంది. సమర్థులైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించనుంది.