Revanth Reddy: రైతు కూలీల కోసం చట్టాలను అమలు చేసింది కాంగ్రెస్: సీఎం రేవంత్
ABN , Publish Date - Jan 18 , 2026 | 06:01 PM
కమ్యూనిస్టు మిత్రులను స్ఫూర్తిగా తీసుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి.. పాశవికంగా వ్యవహరించిన ప్రభుత్వాలను పడగొట్టామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఖమ్మంలో జరిగిన సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఖమ్మం, జనవరి18: రైతు కూలీల కోసం చట్టాలను అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు ఖమ్మంలో జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. ఆయనతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ సభలో సీఎం ప్రసంగిస్తూ..' దేశంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్రజెండా నిటారుగా నిలబడి కొట్లాడుతోంది. కామ్రేడ్ సోదరులను నేను మనసారా అభినందిస్తున్నాను. 1925 డిసెంబర్ యూపీలోని కాన్పూర్‌లో ప్రారంభించిన కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రాబోయే వందేళ్లు కూడా పేదలు, గిరిజనుల కోసం కొట్లాడుతాం. అవసరమైతే తుదిశ్వాశ వదులుతామే తప్ప ఎర్రజెండాను మాత్రం వదలం అనడానికి ఖమ్మం శతాబ్ది ఉత్సవాలే నిదర్శనం. కమ్యూనిస్టులను ఆదర్శంగా తీసుకుని పాశవికంగా ప్రవర్తిస్తున్న కొన్ని ప్రభుత్వాలను పడగొట్టాం' అని సీఎం రేవంత్ అన్నారు.
'కమ్యూనిస్టులు పేదల కోసం ప్రభుత్వాలపైనే యుద్ధాలు చేశారు. దున్నేవానిదే భూమి అనే నినాదంతో భూస్వాముల నుంచి భూములను పేదలకు పంచడం జరిగింది. దొరల గడీల దగ్గర బానిసలుగా బతుకుతున్న కూలీల కోసం పోరాటం చేసిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ. అలానే రైతు కూలీల కోసం చట్టాలను అమలుచేసి, వారు ఉద్యమాలు చేస్తే వారికి కావాల్సిన చట్టాలను చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. నాలుగు వేల మంది నేలకొరిగితేనే ఆ విముక్తి రైతాంగ చట్టాలకు కళ్లు తెరిపించింది. రజాకార్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది కమ్యూనిస్టు పార్టీనే' అని సీఎం తెలిపారు.
'ఆనాడు బ్రిటిష్ వాళ్లతో ఎంత ప్రమాదమో.. ఇప్పుడు బీజేపీతోనూ అంతే ప్రమాదముంది. నాడు జాతీయ ఉపాధి హామీ చట్టానికి కాంగ్రెస్ తీసుకొస్తే ఇప్పుడు ఆ పథకాన్ని రద్దుచేసి గ్రామాల్లో వలసలకు బీజేపీ కారణమైంది. బీజేపీ అంటే బ్రిటిష్ పాలనా పార్టీ. అది విభజించి పాలిస్తుంది. పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ పథకానికి మోదీ ప్రభుత్వం తూట్లు పొడిచి నిర్వీర్యం చేయాలని చూస్తోంది. అదానీ, అంబానీలకు కూలీలు దొరకటం లేదు. గత ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు అడిగింది. రాజ్యాంగాన్ని మారుస్తారని రాహుల్ గాంధీ ప్రచారం చేయడంతో 290 సీట్లకు పరిమితమైంది' అని గుర్తు చేశారు ముఖ్యమంత్రి.
'నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారానే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. నిజాం రజాకార్లను తరిమిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్రా రాజేశ్వరరావు, నల్లమల్ల గిరిప్రసాద్ పోరాటం చేశారు. పేదల వ్యతిరేక పార్టీ బీజెేపీ. ఓటు తొలగిస్తే సంక్షేమ పథకాలు పోతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్, కమ్యూనిస్టు ఏకమవ్వాలి. ఎర్రజెండా సోదరులు పిలవగానే వచ్చాను. మీరు పోరాడే వాటికి చట్టం చేస్తాం. ఇక్కడ నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరూ కలిసివచ్చిన రెండు సర్పంచ్ స్థానాలను గెలిపించలేరు.' అంటూ సీఎం ఫైర్ అయ్యారు.
Also Read:
బాబర్‌తో ఎలాంటి విభేదాల్లేవు.. స్పష్టం చేసిన స్టీవ్ స్మిత్
ఖాళీ పేస్ట్ ట్యూబ్‌ను పక్కన పడేస్తున్నారా.. ఈమె ఎలా వాడిందో చూస్తే..
యువకుడి గొప్ప మనసు.. ఆకలితో అల్లాడుతున్న వృద్ధుడిని..