Share News

ఖమ్మం బేతుపల్లి పెద్ద చెరువు ప్రమాదం.. 11 మందినీ క్షేమంగా కాపాడిన రెస్క్యూ బృందాలు

ABN , Publish Date - Nov 05 , 2026 | 07:15 AM

ఖమ్మం జిల్లాలోని బేతుపల్లి పెద్ద చెరువు వద్ద చోటుచేసుకున్న ప్రమాదం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. మత్స్యకారులను ఒడ్డుకు తీసుకువచ్చేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాల పడవలు ఒక్కసారిగా వరద ప్రవాహానికి గురై బోల్తా పడటంతో 11 మంది గల్లంతయ్యారు. వీరిలో ఆరుగురు ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, నలుగురు ఫైర్ సిబ్బంది, ఒక మత్స్యకారుడు ఉన్నారు.

ఖమ్మం బేతుపల్లి పెద్ద చెరువు ప్రమాదం.. 11 మందినీ క్షేమంగా కాపాడిన రెస్క్యూ బృందాలు
Bethupalli Reservoir

ఖమ్మం, నవంబర్ 5: జిల్లాలోని బేతుపల్లి పెద్ద చెరువులో వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది చేపట్టిన సహాయక చర్యలు అత్యంత సాహసోపేతంగా సాగాయి. తొలుత గల్లంతైన 11 మందిలో నలుగురు ఫైర్ సిబ్బందితో పాటు ఒక ఎస్‌డీఆర్‌ఎఫ్ సభ్యుడిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. అనంతరం మరో ఇద్దరి ఆచూకీ గుర్తించి వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగించాయి. రాత్రి కావడంతో చీకటి సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారినా, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఎంతో శ్రమించి గాలింపు చర్యలను కొనసాగించారు. తెల్లవారిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేసి మిగిలిన వారిని కూడా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.


ఈ మొత్తం సహాయక చర్యలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా పర్యవేక్షించారు. ఆఖరి వ్యక్తిని సైతం ఒడ్డుకు చేర్చే వరకు అక్కడే ఉండి అధికారులకు, సహాయక బృందాలకు అవసరమైన సూచనలు చేశారు. తొలుత తొమ్మిది మందిని రక్షించగా, మిగిలిన ఇద్దరి కోసం కొనసాగిన ఉత్కంఠభరిత గాలింపు చివరకు విజయవంతమైంది. వరద ప్రవాహంలో చిక్కుకున్న 11 మందినీ రెస్క్యూ బృందాలు క్షేమంగా ఒడ్డుకు చేర్చడంతో ఆపరేషన్ సుఖాంతమైంది. ఈ సందర్భంగా ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు చేపట్టిన ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది సేవలను పలువురు అభినందించారు. తమను సురక్షితంగా కాపాడినందుకు మత్స్యకారులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాగమయి దయానంద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి, రాత్రంతా శ్రమించి 11 మంది ప్రాణాలను కాపాడిన రెస్క్యూ బృందాల కృషి అభినందనీయం.

ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బేతుపల్లి పెద్ద చెరువులో చిక్కుకున్న మత్స్యకారులు , ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అందర్నీ రక్షించిన అధికారులను అభినందించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. జిల్లా కలెక్టర్ దివాకర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బేతుపల్లి చెరువు వరద ఉధృతి కారణంగా సమీప కాలనీలు నీట మునిగే పరిస్థితి ఏర్పడితే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా కూటమిదే విజయం: పవన్ కల్యాణ్

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్టు

స్థానిక ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీజీపీ

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 05 , 2026 | 09:54 AM